మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. ప్రతిరోజూ ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటే.. మరణాల సంఖ్య కూడా వందల్లో ఉంటోంది. దీంతో అగ్రరాజ్య అధికార యంత్రాంగం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయలేక తలలు పట్టుకుంటోంది. పైగా, మున్ముందు మరింత గడ్డుకాలం తప్పదనీ, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలంటూ సాక్షాత్ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పిలుపునిస్తున్నారు. దీంతో అమెరికన్లు ప్రాణభయంతో హడలిపోతున్నారు.
ఇకపోతే దేశంలో కరోనా వైరస్ ఆంక్షలు విధించిన తర్వాత కూడా దాదాపు 40 వేల మంది అమెరికాలో ప్రవేశించారట. మరోవైపు.. చైనా నుంచి వస్తున్న ప్రయాణికుల తనిఖీల విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆ పత్రిక పేర్కొంది. జనవరిలో తొలి రెండు వారాల వరకూ కూడా చైనా నుంచి వచ్చిన వారిలో ఏ ఒక్కరినీ వైరస్‌కు సంబంధించిన స్క్రీనింగ్ చేయలేదని పేర్కొంది.
అమెరికాలో జనవరి 20న తొలి కరోనా కేసు నమోదవగా.. ఇప్పటి వరకూ కరోనా సోకినా తొలి వ్యక్తి అమెరికాలోకి ఎలా ప్రవేశించారనే సమాచారం లేకపోవడం.. అక్కడి పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టినట్టు చెబుతోంది. అంటే.. ఆరంభంలో కరోనా వైరస పట్ల అగ్రరాజ్యం అమెరికా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానిఫలితాన్ని ఇపుడు అమెరికా అనుభవిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.