సాధారణంగా ఇంటిలో వంట గదిని ఆగ్నేయం వైపు నిర్మించుకుంటారు. అలా వీలు పడనపుడు మాత్రం వాయువ్యంలో నిర్మించుకుంటారు. వాస్తవానికి వాయువ్యంలో వంట గదిని నిర్మించుకోవచ్చా అనే అంశంపై అనేక మంది సందేహాలు ఉంటుంటాయి.
ఇదే అంశంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. వాయవ్యంలో వంటగదిని నిర్మించుకోవడం వాస్తుపరంగా దోషమేమీ కాదంటున్నారు. వాయవ్యంలోని వంటగదిలో తూర్పువైపు గోడకు గాని, పడమరవైపు గోడకు కాని వంట గట్టు కట్టుకోవచ్చు. తూర్పువైపు గట్టు కట్టుకున్నప్పుడు ఆ గట్టు (ఫ్లాట్‌ఫాం) ఉత్తరం గోడని అంటకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
అంటే ఉత్తరం వైపు గోడకు కనీసం ఒక అడుగు స్థలం వదిలి కట్టుకుంటే మంచిదంటున్నారు. ఈ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసుకోవడానికి మన చెయ్యి ఆడటానికి వీలుంటే చాలు. అప్పుడు అక్కడ బొద్దింకలు వగైరా చేరకుండా శుద్ధిగా ఉండే అవకాశం వుంటుందని చెపుతున్నారు. అలాగే పడమరవైపు కూడా వంట గట్టుని కట్టుకోవచ్చంటున్నారు.
ఆ వంట గట్టుని మాత్రం ఉత్తరం గోడని అంటకుండా ఖాళీ వచ్చేలా నిర్మించుకోవాలి. వాయవ్యం వైపు నిర్మించుకునే వంటగదిలో మన ముఖం తూర్పువైపు పెట్టి వండే విధంగానూ లేదా పడమరవైపు పెట్టి వండే విధంగానూ వంట గట్టుని కట్టుకోవచ్చని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.