కేసీఆర్ బిగ్ జీరో.. కుటుంబ ప్రయోజనాల కోసమే.. సీఎం కావాలని?: ఖుష్బూ

మంగళవారం, 20 నవంబరు 2018 (13:43 IST)
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో... ఆ రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నటి ఖుష్భూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. అప్పులిచ్చే స్థితిలో వున్న రాష్ట్రాన్ని అప్పులు చెల్లించాల్సిన స్థితిలోకి నెట్టారని.. ఖుష్భూ ఫైర్ అయ్యారు.


ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని వ్యాఖ్యానించారు. తన కుటుంబ ప్రయోజనాల కోసమే.. ఆయన తిరిగి సీఎం కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. 
 
కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా తెరాస ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. మహిళా సాధికారితపై మాట్లాడే కేసీఆర్, తన కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేదనే విషయాన్ని ఖుష్బూ గుర్తు చేశారు.

ఈ ఎన్నికల్లో నలుగురు మహిళా అభ్యర్థులను మాత్రమే టీఆర్ఎస్ నిలిపిందంటే.. మహిళలపై ఆయనకున్న అభిమానం ఏంటో తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. 
 
సచివాలయానికి రాకుండా పరిపాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆర్ అని విమర్శించారు. చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ కమిషన్‌కు ఛైర్మన్‌గా మగవారిని నియమించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో అవినీతి స్కామ్‌లున్నాయని.. అందులో బతుకమ్మ స్కామ్ కూడా వుందని గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు