మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి: గల్లా

శుక్రవారం, 20 జులై 2018 (12:34 IST)
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3వేల కోట్లు, గుజరాత్‌లో పటేల్ విగ్రహానికి రూ.3,500 కోట్లు ఇచ్చారు. అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి మాత్రం వెయ్యి కోట్లు. పోలవరానికి రూ.58,600 కోట్లయితే.. రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఏపీ ఎంపీ  గల్లా జయదేవ్ అన్నారు.


ఢిల్లీ కంటే పెద్దది, ఉత్తమమైన రాజధాని నిర్మిస్తామని ప్రధానే స్వయంగా హామీ ఇచ్చారు. ఆయనిచ్చిన హామీతో రైతులంతా ముందుకొచ్చి ఉదారంగా భూములిచ్చారు. కానీ ఇచ్చిన హామీలను విస్మరించారు. ప్యాకేజీల పేరుతో పైసా ఇవ్వలేదన్నారు. 
 
భాజపా మమ్మల్ని ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా చూస్తోంది తప్ప.. దక్షిణాది రాష్ట్రాలతో కాదు. పోలవరానికి ఇచ్చే నిధులు విభజన చట్టంలోని సెక్షన్‌-90 కింద ఇచ్చేవి. ఏపీకి ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విభజన చట్టంలో భాగంగా ఇచ్చినదే. ఆ నిధులన్నీ కచ్చితంగా ఇచ్చి తీరాల్సినవే. ఎంతో ఉదారంగా సాయం చేశామని చెప్పడం శుద్ధ అబద్ధమని గల్లా జయదేవ్ తెలిపారు. కాంగ్రెస్‌ తెలుగుతల్లిని రెండుగా చీల్చి రాష్ట్ర విభజన చేసిందని మోదీ అప్పట్లో అన్నారు. కాంగ్రెస్ తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని వ్యాఖ్యానించారు. 
 
అయితే విభజన పాపంలో భాజపాకు సగం పాత్ర ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని మీ పార్టీ సభ్యులే డిమాండ్‌ చేసిన సంగతి గుర్తుందా? అంటూ మోదీని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వొద్దని చెప్పిందని కేంద్రం చెబుతోంది. ఇది పూర్తిగా అసంబద్ధం. మేమెప్పుడూ అలా చెప్పలేదని 14వ ఆర్థిక సంఘానికి ప్రాతినిధ్యం వహించిన గోవిందరావు చెప్పారు. ప్రధాని, ఆర్థిక మంత్రి అవాస్తవ విషయాలను గమనించాలి. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి.. అంటూ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు