బీజేపీ నాయకత్వం జనసేన అధ్యక్షులు కల్యాణ్ గారితో ఈ అంశంపై చర్చించారనీ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు గంటపాటు ఎవరి ఇళ్ళల్లో వారు నల్ల బ్యాడ్జిలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని చెప్పారు.
అంతర్వేది పుణ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధమైన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుందన్నారు. ఈ ఘటనపై తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.
బుధవారం సాయంత్రం జనసేన పార్టీ పార్లమెంట్ సంయుక్త కమిటీల సమన్వయకర్తలు, సభ్యులతోనూ, అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి. భాగస్వామ్య పక్షంగా బీజేపీకి మద్దతు తెలుపుదాం. నిరసనల్లో భాగంగా నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులను, నాయకులను, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేయడం జరిగింది.
అలాగే అంతర్వేదిలో చోటుచేసుకున్న ఘటనపై నిరసన తెలిపిన యువతను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. అక్కడ చోటు చేసుకున్న ఘటనపై బాధపడుతున్నవారిపైనే ఎదురు కేసులుపెట్టి అరెస్టులు చేయడం సరికాదు. ఆ సంఘటనకు బాధ్యులైనవారి గురించి విచారణపై దృష్టిపెట్టకుండా మనోభావాలు దెబ్బ తిన్నవాళ్లపై కేసులుపెడుతున్నారు. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ అరెస్టుల విషయం, నాయకుల్ని గృహ నిర్భందంలోకి తీసుకోవడాన్ని పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. సమాజంలో ప్రశాంతమైన వాతావరణం రావాలని జనసేన పార్టీ కోరుకుంటుంది. వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఎందుకు వస్తుందనే అంశం మీద శ్రీ పవన్ కల్యాణ్ గారు చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాత్రి నుంచి అమలాపురం పార్లమెంట్ పరిధిలో జనసేన నాయకులు, కార్యకర్తల హౌస్ అరెస్టులు బాధాకరం అన్నారు.