ఏపీ రాజధానిగా అమరావతే : బీజేపీ నేత పురంధేశ్వరి

మంగళవారం, 25 జులై 2023 (19:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని ఆరోపించారు. 
 
అదేసమయంలో ఏపీకి కేంద్రం ఏం చేయడం లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి కేంద్రం అత్యధిక ఇళ్లను కేటాయించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
 
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, పార్టీని ముందుకు నడిపే బాధ్యత తమముందు ఉందని చెప్పారు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసిందని స్పష్టం చేశారు. తమకు అనుకూలమైనవారి పేర్లతో దొంగ ఓట్లు సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూడటం దుర్మార్గమని అన్నారు.
 
'సీఎం జగన్ పదే పదే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని వారిని సొంతం చేసుకునే భావనతో మాట్లాడుతున్నారు. మరి వారికి ఏం న్యాయం చేశారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేశారు? తాడేపల్లిలో సీఎం ప్యాలెల్‌కు కూతవేటు దూరంలో ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే.. ఆమెకు న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది' అని మండిపడ్డారు.
 
అమరావతిలోని ఆర్-5 జోన్ లో పేదల ఇళ్లకు నిర్మాణం అనే అంశం కోర్టులో ఉందని పురందేశ్వరి చెప్పారు. 'మేము పేదలు, అమరావతి రైతుల ఇద్దరి పక్షం. పేదలకు ఇళ్లు ఇవ్వొద్దని మేము ఎక్కడా చెప్పలేదు. అక్కడ నిర్మాణమయ్యే ఇళ్లకు కూడా ప్రతి ఇంటికి రూ.1.8 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే విషయాన్ని గమనించాలి' అని గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు