కరోనా కష్ట కాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు మనసున్న మహరాజులు ముందుకు రావాలని, పేదలను మానవతా ధృక్పదంతో ఆదుకుంటున్న దాతల సేవలు ఎనలేనివని, కష్టకాలంలో ఉన్న వారికి సహాయ పడడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి మీరాహుస్సేన్‌ఖాన్ పేర్కొన్నారు.
నందిగామ పట్టణానికి చెందిన పేదింటి యువతి వివాహ ఖర్చుల నిమిత్తం మీరాహుస్సేన్‌ఖాన్ తన మిత్రబృందంతో కలిసి రూ. 10,116లు ఆర్ధిక సహాయం యువతి బంధువులకు అందచేశారు. ఈ సందర్భంగా మీరా హుస్సేన్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందించడంలో ఉన్న సంతృప్తి మరెందులో ఉండదని, మనం ఎంత సంపాదించామన్న దానికంటే ఎదుటివారికి ఎంతో కొంత సహాయపడడం ముఖ్యం అన్నారు.
తనతో పాటు సహాయం అందించిన తన మిత్రబృందానికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినెల ఏదోఒక సేవా కార్యక్రమం తన మిత్రులతో కలిసి చేయడం ఆనందం కలిగిస్తుందని, మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ, పఠాన్ సైదాఖాన్, శ్రీనివాసరావు, యువతి బంధువులు సాధిక్, బాజి, తదితరులు పాల్గొన్నారు.