కోర్కె తీర్చమంటున్నాడనీ ఫిర్యాదు చేస్తే కాంప్రమైజ్ కావాలన్న బ్యాంకు డీజీఎం.. ఎక్కడ?

బుధవారం, 30 ఆగస్టు 2017 (10:37 IST)
అమాయక మహిళలకే కాదు బాగా చదువులు చదువుకుని ఉన్నత కొలువుల్లో ఉండే మహిళలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ మహిళా మేనేజర్‌కు ఆ బ్యాంకు సీనియర్ మేనేజర్ నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. సమ్మె కారణంగా బ్యాంకు ఉద్యోగులు ఎవ్వరూ విధులకు హాజరుకాలేదు. 
 
దీంతో బ్యాంకులో సీనియర్ మేనేజర్‌తో పాటు బ్యాంకు మేనేజర్ మాత్రమే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సీనియర్ మేనేజర్, మేనేజర్‌గా పని చేస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బ్యాంకు డీజీఎంకు ఫిర్యాదు చేస్తే ఆయన కాంప్రమైజ్ కావాలంటూ సలహా ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, పద్మాకాలనీలో నివాసముండే ఓ మహిళ నల్లకుంట తిలక్‌నగర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో ప్రొబెషనరి మేనేజర్‌గా పనిచేస్తుంది. ఈనెల 22వ తేదీన బ్యాంకుల సమ్మె ఉన్నా బ్యాంకుకు వచ్చింది. ఆ సమయంలో బ్యాంకు హెడ్, సీనియర్ మేనేజర్ భాటియా బ్యాంకులోనే ఉన్నాడు. 
 
మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో మహిళ భోజనం చేసేందుకు లంచ్ గదిలోకి వెళ్లింది. కొద్దిసేపు తర్వాత సీనియర్ మేనేజర్ భాటియా వచ్చి ఆమె భుజంపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ రోజు సమ్మె, సిబ్బంది ఎవ్వరూ రాలేదు.. బ్యాంకులో మనమిద్దరమే ఉన్నాం. ఎంజాయ్ చేద్ధాం రా అంటూ వేధించాడు. దీంతో షాక్‌కు గురైన ఆమె.. ఆ కామాంధుడిని తప్పించుకుంది.
 
ఆ తర్వాత అంటే ఆగస్టు 23వ తేదీన బ్యాంకు రీజినల్ కార్యాలయంలో డీజీఎంకు ఫిర్యాదు చేసింది. 28న బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ నుంచి ఆ మహిళకు ఫోన్ చేసి భాటియాతో కాంప్రమైజ్ కావాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో ఆమె సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు