కులాలకు, మతాలకు మధ్య చిచ్చు రాజేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రజల ఐక్యతను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో బ్రాహ్మణులను, వైశ్యులను ప్రభావితం చేసేలా మతం ప్రాతిపదికగా మాట్లాడే వారి అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అన్నీ తరగతులకు లబ్ది చేకూరేలా సుపరిపాలన సాగిస్తోందన్నారు.
రాష్ట్రంలో ఆర్య, వైశ్యులు రాజకీయంగా రాణించాలనేది సిఎం జగన్ సంకల్పమని, అందుకు అనుగుణంగానే వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.
రాష్ట్రంలో బిజెపి నేతలు మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు రాజేస్తూ అప్పుల పేరిట అయోమయం సఅష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు.
బిజెపి నేతల వ్యవహారశైలి చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా దుష్ప్రచారం కొనసాగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోందనీ, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు.
టిడిపి-బిజెపి భాగస్వామ్య ప్రభుత్వం ఉన్నపుడు విజయవాడలో ఆలయాలను కూలగొట్టారని, అప్పుడు నోరుమెదపని బిజెపి ఇప్పుడు చిన్న చిన్న ఘటనలు జరిగినా రెచ్చగొట్టేందుకు నానాయాగి చేస్తున్నారని విమర్శించారు. బిజెపి ప్రజలు, ప్రజా సమస్యలు పట్టవని తెలిపారు.
జగన్ లాంటి బలమైన నాయకుడిని ఎదుర్కొవాలంటే..ఏదొక ముద్ర వేసి 'వీక్ పాయింట్'గా మార్చి దెబ్బకొట్టాలనే ధ్యేయంగా ముందుకు బిజెపి నేతలు సాగుతున్నారని విమర్శించారు. జగన్ కుటుంబం అనుసరించే 'విశ్వాసా'న్ని వీక్ పాయింట్‌గా భావిస్తున్నారని తెలిపారు.