ప్రజలకు లేని పండుగ మనకెందుకు.. పండగ పూటా కలెక్టరేట్‌లోనే చంద్రబాబు

ఠాగూర్

శనివారం, 7 సెప్టెంబరు 2024 (09:31 IST)
బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో వరద బాధితులను ఆదుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరంలోనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శనివారం వినాయక చవితి పండుగ సందర్భంగా కూడా ఆయన అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రజలకు లేని పండగ మనకెందుకు అన్నారు. పైగా, విజయవాడ కలెక్టరేట్ ఆవరణలోనే వినాయక విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన కనకదుర్గ ఆలయం అర్చకులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 
 
మరోవైపు, వినాయక చవితి పండుగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
 
వాడవాడలా చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహా గణపతిని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. విఘ్నాలను అధిగమించి, రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
 
ఇక, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడిని మనసారా వేడుకుంటూ సకల జనులకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వివరించారు. ఏపీ ప్రజలు వరదలతో భీతిల్లుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తిప్రపత్తులతో ఆనందదాయకంగా జరుపుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమని జనసేనాని విచారం వ్యక్తం చేశారు. అందువల్ల వినాయక పందిళ్లను ఆడంబరంగా, ఆర్భాటాలకు పోకుండా సంప్రదాయబద్ధంగా పరిమితంగా చేసుకుని, ఆ విధంగా మిగిలిన నిధులను వరద బాధితులను ఆదుకోవడానికి వినియోగించాలని మనవి చేశారు.
 
మట్టి వినాయక ప్రతిమలనే పూజించండి అని ఎప్పట్లాగే ఇప్పుడూ చెబుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నీటిలో కరగని కృత్రిమ పదార్థాలతో రూపొందించిన ప్రతిమలను ప్రోత్సహించవద్దని పిలుపునిచ్చారు. మన భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలన్న సంకల్పాన్ని విస్మరించవద్దని సూచించారు. వరదలు, కరవు కాటకాలు లేని భవిష్యత్తును ప్రసాదించమని "నమామి తమ్ వినాయకం" అని ప్రార్థిస్తూ జనులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు