తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి నుంచే క్రీస్తు ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేవదూతగా శాంతాక్లాజ్ బహుమతులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేస్తున్నారు. పర్వదినం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌ను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.
క్రీస్తు జననాన్ని తెలియజేసేలా చర్చిల్లో బొమ్మలు ఏర్పాటు చేశారు. గుణదల మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, క్రీస్తు గీతాలను ఆలపించారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రార్థనల కోసం మందిరం ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోటగిరి లంకలో ఆర్సీఎం చర్చిలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్ ఆకర్షణగా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు ఏసుక్రీస్తును ప్రార్థించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.