ప్రభుత్వం ఏమిస్తే మీరు అభివృద్ధి చెందుతారు... ప్రజల వద్దకు సీఎం బాబు

శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (22:08 IST)
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలేకరులతో అనేక అంశాలపై మాట్లాడారు. అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవార్ఢులు బహుకరణ చేయనున్నట్లు చెప్పారు. అలాగే 1,42,000 ఇళ్లలో గృహ ప్రవేశాలు, రైతులకు మూడో విడత రుణమాఫీకి నాంది, పూర్తయిన వీధి లైట్ల ప్రారంభిస్తున్నామని చెప్పారు. త్వరలో ఊరంతా అభివృద్ధి చేసుకుందాం అనే పిలుపు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వం ఏమి ఇస్తే, మీరు, మీ గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజలతోనే చర్చ చేపడతామన్నారు. 
 
పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీటిని విడుదల చేయడంపై నీటిని దొంగిలించామంటూ విమర్శించడం దారుణమన్నారు. వాళ్లు మనుషులేనా? అని మండిపడ్డారు. దామాషా పద్ధతి ప్రకారం నీటిని వినియోగించుకుంటున్నామన్నారు. మన ఊరుకు నీరిస్తే వారికి అసూయ కలుగడం దారుణమన్నారు. నీళ్లను ఎవరయినా దొంగలించుపోగలరా? అని ప్రశ్నించారు. పోలవరం, రాజధాని, పురుషోత్తమపట్నం, గాలేరి-నగరి నిర్మాణాల్లోనూ ప్రతిపక్ష పార్టీ అడ్డుతగలడం అన్యాయమన్నారు. పట్టిసీమ వల్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఎండిపోతాయని దుష్పప్రచారం చేశారని ప్రతిపక్ష పార్టీపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఎంపి దివాకర్ రెడ్డి రాజీనామా అంశం పెద్ద ఇష్యూ కాదని అన్నారు. కొద్ది రోజుల కిందట జల హారతి కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు వెళ్లినప్పుడు జేసీ తమ్ముడు సాగునీటి కోసం వినతిపత్రమిచ్చారన్నారు. అప్పడే నీరు విడుదల చేయమని అధికారులను ఆదేశించానన్నారు. అన్ని ప్రాంతాలకు నీరివ్వాలనేది తన లక్ష్యమన్నారు. 13 వేల కోట్లతో 28  సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభానికి సిద్ధమయ్యామన్నారు. ఇన్ని ప్రాజెక్టులు నిర్మించడం సాధ్యమా? అని అన్నారు. ఇప్పుడు చేసి చూపించామన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపనతో పాటు ప్రారంభం కూడా తానే చేశానన్నారు. 
 
ఇటీవల వంశధార ట్రైబ్యునల్ తీర్పుతో హిరమండలంలో బ్యారేజీ నిర్మించతలపెట్టామన్నారు. ఆ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే 50 టీఎంసీలు నిల్వ చేయొచ్చునన్నారు. ఈ నీటిని ఇచ్చాపురం వరకూ తీసుకెళ్లవొచ్చునన్నారు. సుజల స్రవంతి పూర్తయితే విశాఖకు ఎంతో మేలుకలుగుతుందన్నారు. 6 లక్షల పంట కుంటలు తవ్వామన్నారు. కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ కింద సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
 
ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లోనే మైక్రో ఇరిగేషన్ కింద సాగు అవుతుందన్నారు. ఉద్యానవన పంటల సాగు ద్వారా రైతుల ఆదాయం ఘననీయంగా పెరుగుతుందని సీఎం చెప్పారు. ప్రభుత్వం రాయలసీమలో విస్తృతంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు.  ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికి ఆయా ప్రాజెక్టుల వద్ద రాత్రి బస చేశానన్నారు. నా జీవితంలో మొదటిసారి బస్సులో పడుకున్నానన్నారు. పోలవరం నిర్మాణ సందర్భంగా తెలంగాణలో ఉన్న ఏడు ముంపు మండలాలను ఇస్తేనే, సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి స్పష్టం చేశానన్నారు. 
 
తన పట్టుదలపైనే ఆ 7 ముంపు మండలాలను ఏపీలో కలిసేలా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం, మరోపక్క అభివృద్ధి, ఇంకో పక్క సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. రైతుల్లో నమ్మకం పెంపొందించి, వారి ఆదాయం పెంచాలనేది తన ధ్యేయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఏటా జూన్ 2న నవ నిర్మాణ దీక్ష చేస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రజలందరిలోనూ కసి కనిపించేలా నవ నిర్మాణ దీక్ష చేస్తున్నా మన్నారు. హైదరాబాద్‌లో మాదిరిగా రాజధానిని నిర్మాస్తానని చెప్పారు.  
 
హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. ఆ నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశానని అన్నారు. హైదరాబాద్‌లో పరిశ్రమల అభివృద్ధికి న్యూయార్క్‌లో చంకలో ఫైళ్లు పెట్టుకుని తిరిగానని, ట్రాఫిక్ కారణంగా ఫుట్‌పాత్ పైన నడుచుకుంటూ కూడా వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రినని ఇగోకి పోకుండా, ప్రజల కోసమని వెళ్లానని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు