వివాహాలు కుదిర్చే వెబ్ సైట్ల ద్వారా ఎన్నారైలకు గాలం వేస్తున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వివాహాలు కుదిర్చే వెబ్ సైట్లలో తప్పుడు ప్రొఫెల్స్ పెట్టి ప్రవాస భారతీయ యువకులకు గాలం వేస్తూ.. ఘరానా మోసాలకు పాల్పడుతున్న దీప అనే యువతిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర పరిధిలోని బ్రాడీపేటలో నివాసం ఉండే దీప్తి విలాసాలకు అలవాటు పడి.. తేలికగా డబ్బులు సంపాదించాలనుకుంది. అంతే అడ్డదారిని ఎంచుకుంది.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో నకిలీ అకౌంట్లు సృష్టించింది. ఇలా తన నకిలీ అకౌంట్లను సంప్రదించే వారిని మోసం చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధరణి కుమార్ ఆమెకు పరిచయం అయ్యాడు. అతడిని వివాహం చేసుకుంటానని నమ్మించి.. తనకు అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి రూ.1.86లక్షలు తీసుకుంది.
ఆపై ఆమె మాటల్లో తేడాను గమనించిన ధరణి.. తన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా అడిగాడు. ఎంతకీ ఇవ్వకపోగా.. బెదిరింపులకు దిగింది. దీంతో తాను మోసపోయాననే విషయాన్ని గమనించిన ధరణి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీపపై గతంలో ఇలాంటి కేసులు చాలానే వచ్చాయని, గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీపను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.