వైజాగ్ టెక్కీ పాకిస్థాన్‌ గడ్డపై ఎలా అడుగుపెట్టాడంటే...

మంగళవారం, 19 నవంబరు 2019 (11:55 IST)
వైజాగ్‌కు చెందిన ఓ టెక్కీ పొరపాటున పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టాడు. దీంతో పాక్ భద్రతా బలగాలు అతన్ని అరెస్టు చేశాయి. అలాగే, మరో భారత పౌరుడు కూడా పాక్‌లోకి పొరపాటున ప్రవేసించాడు. అతన్ని కూడా పాకిస్థాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 
అలాగే, పాక్ గడ్డపై అడుగుపెట్టిన వైజాగ్ టెక్కీ పేరు ప్రశాంత్ వైందం. హైదరాబాద్‌లో టెక్కీగా పని చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ వాసి, ప్రశాంత్‌లు పాస్‌పోర్టు, వీసా లేకుండా వీరు తమ దేశంలోకి ప్రవేశించినట్టు పాక్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 14వ తేదీన వీరిని బహావుల్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరిద్దరిపైన అక్కడి చట్టంలోని 334-4 కింద అభియోగాలు నమోదయ్యాయి.
 
రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో వీచే బలమైన గాలుల వల్ల భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న కంచె కొన్నిసార్లు కనిపించదని, దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు పొరపాటు పడి సరిహద్దు దాటుతుంటారని భారత అధికారులు తెలిపారు. తాజా ఘటనలోనూ అదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
 
మరోవైపు, అక్కడి మీడియా మాత్రం వీరిపై అనుమానపు కథనాలు రాసింది. పాక్ అదుపులో ఉన్న ఇద్దరిలో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని, అధునాతన ఉగ్రదాడి చేసేందుకు వీరిని పంపించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రాసుకొచ్చింది. ఆగస్టులో రాజు లక్ష్మణ్ అనే భారత గూఢచారిని పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అరెస్టు చేసినట్టు ఈ సందర్భంగా పేర్కొంది.
 
మరోవైపు, ప్రశాంత్ తండ్రి బాబూరావు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. తన కుమారుడు ఓ యువతిని ప్రేమించాడనీ ఆ ప్రేమ విఫలం కావడంతో మతిస్థిమితం కోల్పోయి, చెప్పాపెట్టకుండా ఇంటినుంచి వెళ్లిపోయాడని వివరించారు. అలా పొరపాటున పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టివుంటాడని చెపుతున్నారు. ఇదే అంశంపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు