పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

ఠాగూర్

మంగళవారం, 21 మే 2024 (09:05 IST)
పల్నాడు జిల్లా ఎస్పీగా ఐపీఎస్ అధికారిణి మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత ఈ జిల్లాలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో జిల్లా ఎస్పీగా ఉన్న బిందు మాధవ్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహించడం, విపక్ష నేతలపై అధికార నేతల దాడులను ప్రోత్సహించేలా నడుచుకున్నారన్న అభియోగాల నేపథ్యంలో ఆయనపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత జిల్లా ఎస్పీగా ఆయన స్థానంలో మలికా గార్గ్‌ను ఈసీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు  సజావుగా జరిగేలా చూడటం నా తొలి కర్తవ్యమన్నారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టిస్తానని తెలిపారు. 
 
ఇటీవల కొన్ని ఘటనలు కారణంగా పల్నాడులో శాంతిభద్రతలు అదుపుతప్పాయని ఆమె చెప్పారు. రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని తెలిపారు. పోలీసులు అధికారులు తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించబోనని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. 
 
బీజేపీ అభ్యర్థికి ఎనిమిదిసార్లు ఓటు వేసిన యువకుడు... 
 
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి నిబంధనలు అతిక్రమించి ఏకంగా ఎనిమిదిసార్లు ఓటు వేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి పలుమార్లు ఓటు వేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో కలకలం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. దీంతో స్పందించిన పోలీసులు.. ఆ యువకుడిని అరెస్టు చేసి, రంజన్ సింగ్‌గా గుర్తించారు. 
 
నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రంజన్ సింగ్.. బీజేపీ అభ్యర్థి ముఖేశ్ రాజ్‌పుత్ ఎనిమిది సార్లు ఓటేయడం కనిపిస్తోంది. యూపీలోని ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాజ్‌పుత్ బరిలో నిలిచారు. కాగా, నయాగావ్ పోలీస్ స్టేషన్‌లో రంజన్‌పై కేసు నమోదైంది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఘటన జరిగిన పోలింగ్ బూత్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారందరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు