మాజీ మంత్రి అనిల్ కుమార్ దూషణల పర్వం - పోలీసుల నోటీసు జారీ

ఠాగూర్

గురువారం, 24 జులై 2025 (13:45 IST)
నెల్లూరు జిల్లా కోవూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని దూషించిన కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులను స్వయంగా ఇచ్చేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా ఆ సమయంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో లేరు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు అంటించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. 
 
రష్యాలో కుప్పకూలిన విమానం... 49 మంది దుర్మరణం 
 
రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కుప్పకూలిపోయిన ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రయాణికులతో వెళుతున్న విమానం ఒకటి అమూర్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. తొలుత ఈ విమానం అదృశ్యమైనట్టు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. 
 
అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్-24 రకం విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్ చెన్స్క్‌ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. ఇది మరికొద్దిసేపట్లో ల్యాండ్ కావాల్సివుండగా, ఉన్నట్టుండి ట్రాఫిక్ కంట్రోల్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్‌ను సిద్ధం చేసి విమానం కోసం గాలించగా, గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్టు గుర్తించారు. 
 
ప్రమాదం జరిగిన ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ విమానం తొలుత ల్యాండింగ్‌కు యత్నించగా రాడార్ నుంచి గల్లంతై కూలినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు రష్యాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటివరకు 49 మంది చనిపోయారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు