కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పిన గోరంట్ల మాధవ్, ఊరొదలి వెళ్లిపొమ్మంటున్నారట

ఐవీఆర్

బుధవారం, 12 జూన్ 2024 (15:36 IST)
ఎన్నికల సమయంలో చిన్నచిన్న ఘర్షణలు జరిగాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పలు నియోజకవర్గాల్లో వైసిపి-తెదేపా కార్యకర్తలు, నాయకుల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ స్పందిస్తూ... తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదనీ, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లు వ్యవహరించాల్సి వుంటుందని వార్నింగ్ ఇచ్చారు.
 
దీనితో పలువురు తెదేపా కార్యకర్తలు ఆయనను బెదిరిస్తున్నారట. చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారట. దీనితో తనను ఊరు వదిలి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ చెబుతున్నారు. మంగళం వారం నాడు ఇద్దరు సీఐలు తన వద్దకు వచ్చి ఊరు వదలి వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారనీ, ఐతే తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు విడిచి వెళ్లబోననీ, కార్యకర్తల కోసం ఇక్కడే వుంటానని చెప్పారు.
 
ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించింది ప్రజలకు సేవ చేయమని గానీ వైసిపి నాయకులపై దాడులు చేయమని కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దాడులకు భయపడి కొందరు కార్యకర్తలు ఊళ్లు వదిలి వెళ్లిపోయారనీ, ఐతే ఎవ్వరూ అధైర్యపడవద్దనీ, తాము అండగా వుంటామంటూ ధైర్యం చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు