ఏపీలో స్థానిక సమరానికి బ్రేకులు వేసిన సుప్రీంకోర్టు

బుధవారం, 15 జనవరి 2020 (17:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సమరానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. 50 శాతానికి మించి రిజర్వేన్లు ఇవ్వడం న్యాయ సమ్మతం కాదనీ పేర్కొంది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో విచారణ జరిపాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
నవ్యాంధ్రలో స్థానిక సమరానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. అయితే, ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్ల రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబరు 176ను జారీచేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కర్నూల్ కు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రభుత్వం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేస్తూ స్టేకు నిరాకరించింది.
 
దీంతో పిటిషనరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. పైగా, ఈ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలంటూ వేసిన రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించి, నాలుగు వారాల్లోగా కేసు విచారణను పూర్తి చేయాలని హైకోర్టును సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు