తిరుపతి ఉప ఎన్నికలు : జనసేనానిని కలిసిన రత్నప్రభ

శుక్రవారం, 26 మార్చి 2021 (20:18 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతా మోహన్, టీడీపీ తరపున పనబాక లక్ష్మీ, వైకాపా తరపున ఎం.గురుమూర్తిలను అభ్యర్థులుగా ప్రకటించారు. 
 
అయితే, బీజేపీ - జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎవరన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో ఉప ఎన్నిక బరిలో పోటీచేసే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును ఖరారు చేశారు. గురువారం రాత్రి పొద్దుపోయాక బీజేపీ అధికారికంగా ప్రకటించింది.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి. రిటైరయ్యే నాటికి ఆమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. డిప్యుటేషన్‌పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
 
రత్నప్రభకు ఫైర్ బ్రాండ్ అధికారిణి అని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని గుర్తింపు ఉంది. వైసీపీ, టీడీపీలకు ధీటుగా ఉండాలంటే రత్నప్రభ వంటి వ్యక్తి సరైన అభ్యర్థి అని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కరోనాతో కన్నుమూశారు. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది. తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు
 
ఇదిలావుంటే, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర వ్యవహారాల కో ఇన్చార్జి సునీల్ దేవధర్, బిజెపి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మధుకర్ పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు