రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎందుకు పోయాడంటే? రాహుల్ జేజెమ్మ దిగొచ్చినా?: కేటీఆర్

గురువారం, 2 నవంబరు 2017 (10:25 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన పోరాటం వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులకు బాస్‌లు ఢిల్లీలో ఉండొచ్చు... కానీ తెరాస నాయకులకు తెలంగాణ ప్రజలే బాస్‌లని.. వేరే వాళ్లెవ్వరూ బాస్‌‌లు కాదని.. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో... వారికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. 
 
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే విషయం రేవంత్ రెడ్డికే కాదు, వాళ్ల నాయకురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా తెలుసని అన్నారు. మధ్యలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాదు, వాళ్ల జేజెమ్మ దిగొచ్చినా మనల్ని ఏమీ చేయలేరంటూ కేటీఆర్ తెలిపారు. 
 
కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకుపోయాడు? అన్ని దర్వాజాలూ బందయ్యాయి. టీఆర్ఎస్‌లోకి ఎంట్రీ లేదు. తెలుగుదేశం ఖతమైపోయింది. తెరచి ఉన్న ఒకే ఒక దర్వాజా కాంగ్రెస్ పార్టీ.. అందుకే అక్కడికిపోయాడని కేటీఆర్ కామెంట్స్ చేశారు. 
 
రేవంత్ రెడ్డి బిల్డప్‌లు ఎందుకు.. కాంగ్రెస్ పార్టీ మాకేం కొత్త కాదు. వాళ్ల నాటకాలు కొత్త కాదు. ‘తెలుగుదేశాన్ని నేనే అధికారంలోకి తీసుకొస్తా, నేనే ముఖ్యమంత్రిని అవుతా’ అని కొడంగల్‌లో రేవంత్ నాడు చెప్పుకున్నాడు. మరీ, ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? చంద్రబాబునాయుడు, లోకేశ్ నాయుడు, రేవంత్ రెడ్డి ఇదే నరుకుడు నరికారు. ఇప్పుడేమైంది? చంద్రబాబునాయుడు అమరావతికి వెళ్లిపోయాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిపోయాడు. ఇద్దరూ పత్తా లేరు తెలుగుదేశం పార్టీని చాపలాగా మడతపెట్టి ఎక్కడో పెట్టేశారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని దెయ్యమని, రాహుల్‌ని పప్పు అని విమర్శించిన రేవంత్‌కు, ఇప్పుడే వాళ్లే దేవతల్లా కనిపిస్తున్నారు.. ఏం చేద్దాం.. అది వారి కర్మ. ఏది ఏమైనా తెలంగాణ  ప్రజలు కేసీఆర్ వెంట వున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు