ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ

గురువారం, 8 ఆగస్టు 2019 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వైకాపా మహిళా సీనియర్ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కాగా ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు అందచేయడంతో ఆయన ఆమోదించారు. దీంతో కొత్త ఛైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నియమించింది. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కి స్వయంగా అందజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా నియమించిన విషయం తెల్సిందే. 
 
గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన తర్వాత ఆమె మాట్లాడుతూ, 'ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్‌ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచా. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలి' అని ఆమె వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు