కరోనావైరస్: కోవిడ్‌తో పోరాడే ఔషధాన్ని తయారు చేయనున్న భారత్, పాకిస్తాన్
శుక్రవారం, 15 మే 2020 (15:04 IST)
కోవిడ్-19 కి చికిత్స కోసం రెమ్‌డెసివియర్ మందులు తయారు చేసేందుకు ఒక అమెరికా కంపెనీ, దక్షిణ ఆసియాలోని కొన్ని మందుల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలోని గిలియడ్ సంస్థకు, భారత, పాకిస్తాన్ దేశాలలోని అయిదు ఫార్మా కంపెనీలకు మధ్య కుదిరిన ఈ ఒప్పందం 127 దేశాలకు ఈ మందులను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ మందు వాడటం వలన రోగి వ్యాధి లక్షణాలు తగ్గే వ్యవధి 15 రోజుల నుంచి 11 రోజులకు తగ్గినట్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులలో జరిపిన ప్రయోగాత్మక అధ్యయనాలు వెల్లడి చేశాయి. ఈ యాంటీ వైరల్ ఔషధాన్ని మొదట ఎబోలా వ్యాధి చికిత్స కోసం అభివృద్ధి చేశారు. మానవ కణాల్లో వైరస్ వ్యాప్తి చెందడానికి సహకరించే ఎంజైమ్స్‌ను ఈ మందు నిరోధిస్తుంది.
తాజా ఒప్పందం ప్రకారం ఈ మందును వేగంగా, భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకునే హక్కు ఈ అయిదు కంపెనీలకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య అత్యవసర పరిస్థితి ముగిసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే వరకు లేదా వైరస్ ని అరికట్టడానికి మరో మందు కానీ వ్యాక్సీన్ కానీ తయారయ్యే వరకు ఈ ఈ ఔషధ తయారీ లైసెన్సులకు రాయల్టీ రుసుము ఉండదు.
గిలియడ్‌తో కుదిరిన ఒప్పందంతో సిప్లా లిమిటెడ్, ఫిరోజ్‌సన్స్ లాబొరేటరీస్ , హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్, జ్యూబిలంట్ లైఫ్ సైన్సెస్, మైలన్ కంపెనీలకు ఈ మందుని తయారు చేసేందుకు అనుమతి లభించింది. ఈ మందు ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభం కానున్నదో ఇంకా స్పష్టంగా చెప్పలేమని హైదరాబాద్ కి చెందిన హెటెరో ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ బండి బీబీసీతో అన్నారు. అలాగే దీని ఖరీదు కూడా ఇప్పట్లో నిర్ధరించలేమని అన్నారు.
"వీటిపై జూన్ కల్లా స్పష్టత వస్తుంది. ఈ ఔషధాన్ని ప్రభుత్వ సంస్థలు కొన్ని నియంత్రణలతో ఉపయోగించే అవకాశం ఉందని భావిస్తున్నాం. భారతదేశం కనుక ఈ మందును ఉపయోగించాలని నిర్ణయించుకుంటే, దేశీయంగానే దానికి కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది" అని వంశీకృష్ణ చెప్పారు.
దాదాపు 7,500 కోట్ల టర్నోవర్ కలిగిన హెటెరో ప్రపంచంలో యాంటీ-రెట్రోవైరల్ డ్రగ్స్ ఉత్పత్తి చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటి. ఈ సంస్థ ఉత్పత్తి చేసే మందులు దాదాపు 50 లక్షల మంది ఎచ్ఐవి ఎయిడ్స్ బాధితులకి సరఫరా అవుతున్నాయి. హెటెరో ల్యాబ్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న36 సంస్థల ద్వారా సుమారు 300 రకాల మందులు ఉత్పత్తి చేస్తున్నాయి.
అయితే, రెమ్‌డెసివియర్ మందును రోగులకు ఎలా ఇవ్వాలనేది ఇండియన్ మెడికల్ సైన్స్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్ణయించాలి. ఈ మందుని భారతీయ సంస్థలు ఉత్పత్తి చేస్తే భారతదేశంలో కూడా వాడతామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో పని చేసే ఒక సీనియర్ శాస్త్రవేత్త చెప్పారు. కొన్ని వైద్య పరిశీలనల్లో ఈ మందు ప్రభావం చూపిస్తోందని తేలింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసే ఫలితాల కోసం కూడా ఎదురు చూస్తామని రామన్ గంగాఖేడ్కర్ చెప్పారు.
అమెరికా జాతీయ అంటు వ్యాధుల నివారణ సంస్థ (ఎన్ఐఏఐడి) రెమెడెసివీర్ ప్రభావంపై క్లినికల్ ట్రయిల్స్ జరిపింది. ఈ పరిశోధనలో సుమారు 1,063 మంది పాల్గొన్నారు. వీరిలో కొందరికి రెమ్‌డెసివియర్ ఇచ్చారు. మరికొందరికి ప్లాసిబో (ఎలాంటి ఔషధ విలువలు లేని మామూలు పదార్థం) ఇచ్చారు.
ఈ ప్రయోగాలలో రోగి కోలుకోవడానికి పట్టే సమయాన్ని రెమ్‌డెసివియర్ తగ్గిస్తుందని నిరూపణ అయిందని ఎన్ఐఏఐడి డైరెక్టర్ డాక్టర్ ఆంథొనీ ఫౌచీ చెప్పారు. ఈ మందు శరీరంలో వైరస్ వ్యాప్తిని నిరోధిస్తుందని, కోవిడ్ వ్యాధి చికిత్సకు ఒక మార్గం తెరుచుకున్నట్లయిందని ఆయన అన్నారు. ఈ మందుతో చికిత్స చేసిన రోగుల్లో 8 శాతం మరణాలు ఉండగా, ప్రభావం చూపని మందు ఇచ్చినవారిలో మరణాల శాతం 11. 6 శాతంగా ఉందని ఫౌచీ చెప్పారు. అయితే, ఈ గణాంకాల్లోని ఈ తేడాను శాస్త్రీయంగా ఇంకా నిర్ధరించలేదన్నారు.
ఈ మందు వలన ఎవరు లాభపడుతున్నారో స్పష్టత లేదని బీబీసీ హెల్త్ కరెస్పాండంట్ జేమ్స్ గల్లఘర్ అన్నారు. ఈ మందును వాడక ముందే కోలుకున్న వారిని ఇది మరింత తొందరగా కోలుకునేటట్లు చేస్తోందా? లేక ఈ మందు వాడటం వలన ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరం ఉండదా? ఇది ఏ వయస్సు వారిలో సమర్థంగా పని చేస్తోంది? ఇతర అనారోగ్య లక్షణాలు ఏవైనా ఉన్నవారి మీద పని చేస్తుందా లేక అవేవీ లేని వారి మీద మాత్రమే పని చేస్తుందా? వైరస్ సోకిన వెంటనే ఈ మందుతో చికిత్స ప్రారంభించవచ్చా?
ఈ ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురించే సమయానికి ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడం చాలా ముఖ్యమని జేమ్స్ అన్నారు.