భారత్‌లో గత 24 గంటల్లో 3.60 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా మహమ్మారి వేగం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,60,960 కేసులు నమోదయ్యాయి. 3,293 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో కరోనా మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కు, మృతుల సంఖ్య 2,01,18కు పెరిగింది.
140 కోట్ల జనాభా ఉన్న భారత్, కరోనాతో 2 లక్షల మందికి పైగా చనిపోయిన నాలుగో దేశం అయ్యింది. అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలో మొత్తం 1,48,17,371 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 29,78,709కి పెరిగింది. ఇప్పటివరకూ దేశంలో 14,78,27,367 డోసుల వ్యాక్సినేషన్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా తీవ్రరూపం దాల్చింది. నెల రోజుల వ్యవధిలోనే కేసులు 150 రెట్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నెల రోజుల్లో రాష్ట్రంలో కోవిడ్ బాధితులు 150 రెట్లు పెరిగారు. మార్చి 25న రాష్ట్రంలో 35 వేల మందికి టెస్టులు చేస్తే 758 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పుడు పాజిటివ్ రేటు చాలా తగ్గింది. కానీ, ఏప్రిల్ 27 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాజిటివ్ రేటు 20 శాతానికి పెరిగింది. 74,435 మందికి పరీక్షలు చేస్తే 11,434 మందికి పాజిటివ్ అని తేలింది.
సరిగ్గా నెల రోజుల కిందట కోవిడ్ మరణాలు 4 మాత్రమే. ఏప్రిల్ 27 నాటికి ఆ సంఖ్య 64కు పెరిగింది. ఈ నెల రోజుల్లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,469 నుంచి 99,446కు పెరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఓటు హక్కు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారివల్ల శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రభావం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కనిపిస్తోంది. ప్రచారంలో పాల్గొన్న పలువురు నేతలు కూడా కరోనా బారిన పడ్డారు. ఆయా జిల్లాల్లో యాక్టివ్ కేసులు రాష్ట్ర సగటు కన్నా ఎక్కువగా ఉన్నాయి.
అయితే మరణాల విషయంలో వాస్తవాలకు, ప్రభుత్వ లెక్కలకు చాలా తేడా ఉంది. ఇదే విషయం బీబీసీ పరిశోధనలో కూడా తేలింది. ఇక రోజు వారీ కేసుల నమోదులో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ అంతటా నమోదవుతున్న కేసుల్లో 25 శాతం మూడు ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఉంటున్నాయి. దీంతో ఒడిశా ప్రభుత్వం ఉత్తరాంధ్ర సరిహద్దులను మూసివేసింది. చాలా చోట్ల ప్రజలు, వ్యాపారులు కరోనా వ్యాప్తి అడ్డుకోడానికి స్వచ్ఛందంగా లాక్ డౌన్లు విధించుకున్నారు.
ఈ ప్రాంతం నుంచి వలస కూలీలు ఎక్కువ. సెకండ్ వేవ్ ప్రారంభంలో వారంతా తిరిగి సొంత ప్రాంతాలకు రావడంతో, క్యారియర్లుగా మారుంటారని నిపుణులు భావిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్లను కొన్ని చోట్ల ఆసుపత్రి సిబ్బందే బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్న ఘటనలు బయటపడ్డాయి. ఇక ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో వైజాగ్ స్టీల్ కీలక పాత్ర పోషిస్తోంది.రోజూ సుమారు 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఇక్కడ నుంచి ఆక్సిజన్ పంపించారు.
కరోనా తాకిడికి అనుగుణంగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పునరుద్ధరించింది. బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. కొత్తగా వైద్య సిబ్బంది నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉధృతి
తెలంగాణలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. రోజూ సగటున 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ 27వ తేదీ తెలంగాణలో మొత్తం 8,061 కేసులు నమోదు కాగా, 5,093 మంది కోలుకున్నారు. 56 మంది మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 72,133 కి చేరింది. అలాగే నిన్న మొత్తం 82,270 శాంపిళ్లను పరీక్షించగా, ఇంకా 5,241 ఫలితాలు రావాల్సి ఉంది. అయితే 82 వేల శాంపిళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులు 66,485 పరీక్షలు చేయగా ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం 15,785 పరీక్షలు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,508 కేసులు, రంగారెడ్డిలో 514 కేసులు, మేడ్చల్ లో 673 కేసులు నమోదుకాగా, అత్యల్పంగా నారాయణపేటలో 40, ములుగులో 47 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 వేల మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. వ్యాక్సినేషన్‌లో ఇప్పటివరకూ 35 లక్షల మందికి మొదటి డోస్, 5 లక్షల మందికి రెండవ డోస్ వేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా లేదు. అలాగని ఆక్సిజన్ తేలికగా కూడా దొరకడం లేదు. అయితే రెమిడిసివిర్ తో పాటూ కొన్ని అత్యవసరమైన, తప్పనిసరి ఇంజెక్షన్లు దొరకడం సమస్యగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ల స్టాక్ తగినంత ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
కానీ చిన్న, మధ్య తరహా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ చికిత్స తీసుకునే వారి కుటుంబ సభ్యులు ఆయా ఇంజెక్షన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పైరవీలు చేసి, బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి వస్తోంది. అటు పడకలు కూడా ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు దొరకడం కష్టంగానే ఉంది. మరోవైపు మృతుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని పలు స్థానిక తెలుగు పత్రికలు కథనాలు ప్రచురించాయి.
కోవిడ్ చుట్టూ రాజకీయం కూడా జరుగుతోంది. తెలంగాణకు వ్యాక్సీన్ డోసులు, రెమిడిసివర్ తక్కువ కేటాయించారని, ఆక్సీజన్ దూరంగా ఉన్న ప్రాంతాల నుంచి కేటాయించారనీ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఆరోపించారు. ఒకవేళ తెలంగాణలో ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే ఆ బాధ్యత అని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించినా, వరంగల్, ఖమ్మం సహా పలు మునిసిపల్ ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కొనసాగిస్తోంది. దీంతో ఆయా ఎన్నికల ప్రచారాల్లో కరోనా నిబంధనలు పాటించే పరిస్థితి లేదు.
ప్రస్తుతం తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మాత్రం అమలవుతోంది. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకూ ఇది ఉంటోంది. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, ఇంటర్ (11,12 తరగతులు) పరీక్షలు వాయిదా వేశారు. అంతకుమించి పెద్దగా ఆంక్షలు పెట్టలేదు. తెలంగాణతో పాటూ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా విపత్తు నిర్వహణ కోసం 11 మంది ఐఎఎస్‌ల బృందం నిరంతరం పనిచేస్తోంది.
తెలంగాణలో అందుబాటులో ఉన్న పడకల విషయంలో ప్రభుత్వ లెక్కలకీ వాస్తవాలకూ పొంతన ఉండడం లేదు. ఒకవైపు తమ ఆక్సిజన్ ఉన్న పడకలు దొరకడం లేదని పలువురు ఫిర్యాదు చేస్తుండగా, మరోవైపు వేల సంఖ్యలో పడకలు ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మొత్తం 6,513 ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు అందుబాటులో ఉండగా, అందులో 3,133 ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 10,857 ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు అందుబాటులో ఉండగా, వాటిలో 3,880 పడకలు ఖాళీగా ఉన్నాయి.
ఇక ఐసీయూ (వెంటిలేటర్ లేదా సీపీఏపీ) పడకల విషయంలో కూడా ఇలానే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 2,148 ఐసీయూ బెడ్స్ ఉంటే, వాటిలో 799 ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో మొత్తం 7,289 ఐసీయూ పడకలు ఉంటే, వాటిలో 2,699 ఖాళీ ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇవికాక 3,942 ఆక్సిజన్ లేని మామూలు పడకలు గవర్నమెంటు ఆసుపత్రుల్లోనూ, 12,141 పడకలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
కరోనా భయంతో మృతి... రిపోర్టులో నెగెటివ్
కరోనా భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. అవగాహనతో పోరాడాలని, అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నప్పటికీ, కొందరు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో. బోర్గాం గ్రామానికి చెందిన అశోక్ కరోనా అనుమానంతో పరీక్షకు వచ్చారు. పీహెచ్ సీ లో పరీక్ష పలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయనతో పాటూ తల్లీ, ఇతర బంధువులూ వచ్చారు.
ఫలితం వచ్చే లోపు కాసేపు దగ్గరలో ఉన్న చెట్టు కింద కూర్చుని తల్లి ఒడిలో తల పెట్టుకున్న అశోక్ అలాగే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఏప్రిల్ 26న జరిగింది. తరువాత ఆయనకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కొడుకును ఇంటికి పోదాం రారా అంటూ ఏడుస్తూ ఆ తల్లి పిలిచిన పిలుపు అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఇదొక్కటే కాదు, కరోనా మొదటి వేవ్ లోనూ, ఇప్పుడూ కూడా కరోనా వచ్చిందన్న అనుమానం, భయంతో ఒత్తిడికిలోనై షాక్ తో చనిపోతున్న కేసులు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ నమోదయ్యాయి.