సుష్మా స్వరాజ్ ‘తెలంగాణ చిన్నమ్మ’ ఎలా అయ్యారు? రాష్ట్ర ఏర్పాటులో ఆమె పాత్ర ఏంటి?

బుధవారం, 7 ఆగస్టు 2019 (14:03 IST)
2014 డిసెంబర్ 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతారని ఉదయాన్నే ఎంపీలకు, మీడియాకు స్పష్టంగా తెలిసింది. ఆరోజు ఉదయం 10 గంటల నుంచే పార్లమెంటు ఆవరణలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది.


తెలంగాణ ఏర్పాటు అంశం ప్రతి నిమిషానికీ ఒక మలుపు తిరుగుతోంది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఎక్కువ మంది ఎంపీలు తొలిసారి లోక్‌సభకు ఎన్నికైనవారే. దీంతో ఏం జరుగుతుందో తెలియక వారిలో అయోమయం, ఎలాగైనా తెలంగాణను సాధించుకోవాలన్న తపన కనిపిస్తున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఎలాగైనా అడ్డుకుంటామని ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఎంపీలంతా అప్పటికే ప్రకటించుకున్నారు.

 
ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం అయ్యింది.
కేంద్ర మంత్రులుగా ఉన్న చిరంజీవి, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలతో పాటు ఎంపీలు కనుమూరి బాపిరాజు, హర్షకుమార్ తదితరులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. స్పీకర్ మీరాకుమార్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌తో కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావు చర్చలు జరిపారు.

 
అప్పటికే తెలంగాణ బిల్లుకు బీజేపీ పలు సవరణలను ప్రతిపాదించింది. అయితే, అవి రాజకీయ లబ్ధికోసం చేసిన సవరణలని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదని హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీ సింగ్ విలేకరులతో అన్నారు. అయినా, తెలంగాణ బిల్లు నిలిచిపోతుందనే భావన అప్పటికి ప్రబలమవుతోంది. కారణం, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యుపీఏ 2 ప్రభుత్వానికి అవే ఆఖరి పార్లమెంటు సమావేశాలు. ఈ సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగిసిపోనున్నాయి. లోక్‌సభలోను, ఆ తర్వాత రాజ్యసభలోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది.

 
తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలంటే.. నిబంధనల ప్రకారం దానికంటే ముందు ఆంధ్రా ఎంపీలు ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో అడ్డంకులు కనిపిస్తున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్‌తో కావూరు సాంబశివరావు భేటీ కావడం, చర్చలు జరపడం చర్చనీయాంశం అయ్యింది.

 
తెలంగాణ విషయంలో అప్పటి వరకూ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఆ రోజు సభలో జరుగుతున్న పరిణామాలను గమనించిన అడ్వాణీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు భవనం బయట తమ సంతోషం వ్యక్తం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రాంత ఎంపీలు దీంతో, పొన్నం ప్రభాకర్,మధుయాష్కీ గౌడ్ తదితర తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు సైతం సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అప్పుడు ఏం జరిగిందో పొన్నం ప్రభాకర్ బీబీసీతో ఇలా పంచుకున్నారు.

 
''ఆరోజు సభలో ఉన్న వాతావరణాన్ని బట్టి తెలంగాణ బిల్లు ఆమోదం పొందదని అడ్వాణీ భావించారని మాకు తెలిసింది. పైగా, 15వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు, అవీ మూడు రోజుల్లో ముగిసిపోనున్నాయి. ఇలాంటి సమయంలో రాష్ట్ర విభజన వంటి బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో మేం సుష్మా స్వరాజ్‌ను కలిశాం. తెలంగాణకు మద్దతు ఇవ్వాలని ఆమెను కోరాం. మా విజ్ఞప్తికి ఆమె సానుకూలంగా స్పందించారు. 'అడ్వాణీ ఏమనుకున్నా సరే.. నేను తెలంగాణకు మద్దతు ఇస్తా' అని ఆమె మాతో అన్నారు. అయితే, 'మీ కమల్‌నాథ్ (పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి) అటూ.. ఇటూగా ఉన్నారు. చూసుకోండి' అని ఆమె మాకు చెప్పారు. 

 
మేమంతా మొదటిసారి ఎంపీలైనవాళ్లం. కమల్‌నాథ్, స్పీకర్‌లాంటి వాళ్లతో నేరుగా మాట్లాడి, వారిని ఒప్పించలేమని జైపాల్ రెడ్డిని వెంటబెట్టుకుని స్పీకర్ కార్యాలయానికి వెళ్లాం. అక్కడికి సుష్మా స్వరాజ్‌ను కూడా పిలిపించారు. తెలంగాణ ఏర్పాటుపై మీకు చిత్తశుద్ధి లేదంటే మీకు చిత్తశుద్ధి లేదంటూ ఇరువర్గాలూ పరస్పరం ఆరోపించుకున్నారు. సుష్మా స్వరాజ్ మాత్రం స్పష్టంగా చెప్పారు.. 'మీరు బిల్లు పెట్టండి. మేం సహకరిస్తాం' అని. దీంతో జైపాల్ రెడ్డి స్పందిస్తూ.. వెల్‌ (స్పీకర్ స్థానానికి ముందు భాగం)లో ఎంపీలు నిలబడి ఆందోళనలు చేస్తుంటే తెలంగాణ బిల్లును ఎలా ఆమోదిస్తారు? (నిబంధనలు అంగీకరిస్తాయా?) అని అడిగారు. 

 
ఎందుకంటే.. తెలంగాణ బిల్లుకు సభలో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. దీనికి ఓటింగ్ కూడా జరపాల్సి ఉంటుంది. దీంతో సెక్రటరీ జనరల్ నిబంధనలు వివరిస్తూ.. సభకు నిరాటంకంగా అంతరాయాలు కలుగుతున్నప్పుడు, అధికార, ప్రతిపక్ష పార్టీలు అంగీకరిస్తే హెడ్ కౌంట్ (ఎంపీలను నిలబెట్టి, లెక్కించడం) సరిపోతుందని చెప్పారు. దీంతో సుష్మా స్వరాజ్ నిర్ణయం కీలకమైంది. ఆమె అంగీకరిస్తేనే స్పీకర్ మీరాకుమార్ ఈ పద్ధతికి ఒప్పుకునేలా కనిపించారు. సుష్మా స్వరాజ్ దీనికి అంగీకరించారు. 'మీరు బిల్లు పెట్టండి. నేను లేచి నిలబడి మాట్లాడతాను. తర్వాత హోం మంత్రిని ఒక్కొక్క క్లాజు చదువుకుంటూ వెళ్లమనండి. అలాగే ఓటింగ్ కూడా పెట్టండి' అని సూచించారు. దీనికి అంతా అంగీకరించారు'' అని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

 
(బిల్లుపై ఓటింగ్ జరిగేప్పుడు హెడ్ కౌంట్ పద్ధతిని పాటించాలని స్పీకరే నిర్ణయం తీసుకున్నారని, దాన్ని తాము అంగీకరించామని బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్ తెలిపారు.) సుష్మా స్వరాజ్‌ను తెలంగాణ చిన్నమ్మగా తాము చిరకాలం గుర్తుంచుకుంటామని, ఆమె బీజేపీ అయినా.. తాము కాంగ్రెస్ అయినా కూడా తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆమె కీలక పాత్ర పోషించారని పొన్నం ప్రభాకర్ అన్నారు.

 
అయితే, సుష్మా స్వరాజ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? అని బీబీసీ అడగ్గా ఆయన స్పందిస్తూ.. ''నిజానికి అప్పటికి బీజేపీలో తెలంగాణ ఏర్పాటును అంతర్గతంగా వ్యతిరేకిస్తున్న వర్గం కూడా ఉంది. అయితే, బిల్లును పెట్టడానికంటే ముందే సోనియాగాంధీ.. ప్రధాని మన్మోహన్ నివాసంలో అడ్వాణీ, సుష్మా స్వరాజ్‌లను లంచ్‌కు పిలిచి, తెలంగాణకు సహకరించాలని కోరారు. సుష్మా స్వరాజ్ పలుమార్లు పార్లమెంటు లోపల, బయట తెలంగాణకు మద్దతు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలకు కట్టుబడి ఉండాలని, మాట తప్పకూడదన్న ఒకేఒక విచక్షణతో ఆమె వ్యవహరిస్తున్నట్లు మాకు కనిపించింది. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ప్రతిపక్షం అయినా మేం ఆమెను అలా గుర్తుంచుకుంటాం'' అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

 
లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకురాలి హోదాలో సుష్మా స్వరాజ్ ప్రసంగించగా, కాంగ్రెస్ పార్టీ తరపున జైపాల్ రెడ్డి ప్రసంగించారు. బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిపి చర్చలో ప్రసంగించింది మొత్తం ముగ్గురు మాత్రమే.
లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్‌లు సుష్మా స్వరాజ్‌కు పాదాభివందనం చేశారు.

 
తెలంగాణపై సుష్మా స్వరాజ్ ప్రసంగం..
''ధన్యవాదాలు అధ్యక్ష జీ. ఆంధ్రప్రదేశ్ పునర్‌నిర్మాణ బిల్లును ఆమోదం కోసం ఇప్పుడే హోం మంత్రి ప్రవేశపెట్టారు. మా పార్టీ తరపు నుంచి ఆ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు నేను నిలబడ్డాను. ఈ బిల్లుకు మేం మద్దతు ఇవ్వటమే కాదు. ఇది పాసయ్యేలా ఓట్లు కూడా వేస్తాం. ఎందుకంటే ఇది మా విశ్వసనీయతతో ముడిపడిన విషయం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు బిల్లును తీసుకొస్తే, బీజేపీ మద్దతు ఇచ్చి దాన్ని ఆమోదించేలా చేస్తుందని పార్లమెంటు బయట, పార్లమెంటు లోపల, తెలంగాణలోను, తెలంగాణ వెలుపల కూడా మేం ఎన్నోసార్లు డిమాండ్ చేశాం. అంతే కాదు.. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక బిల్లును తీసుకురాకపోతే.. మా ప్రభుత్వం ఏర్పడుతుంది, వంద రోజుల్లో తెలంగాణను ఏర్పాటు చేస్తాం అని కూడా హామీ ఇచ్చాం. అధ్యక్ష జీ.. మీరే సాక్షి. మీరు ఇదే స్థానంలో కూర్చున్నారు. నేను ఇక్కడి నుంచే మాట్లాడాను. తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుంటున్న పిల్లలకు విజ్ఞప్తి చేస్తూ తెలుగులో చెప్పాను. 

 
'తెలంగాణ కోసం బలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి. బతకాలి' అని. ఇప్పుడు ఈ బిల్లు వారి స్వప్నాలను సాకారం చేసేందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించి ఆ పిల్లల పట్ల విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం? కాబట్టే, మొత్తం విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ మేం నిలబడి ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఏర్పడాలన్న ఆ పిల్లల స్వప్నం నిజం కావాలని. నేను కొన్ని విషయాలను రికార్డుల్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. నా తొలి ఫిర్యాదు కాంగ్రెస్ అధిష్టానంపైన. సోనియా జీ నావైపు చూడటం లేదు. కానీ, ఆమె సభలోనే ఉన్నారు. నా తొలి ఫిర్యాదు మీతోనే సోనియా జీ. తెలంగాణ ఇస్తామని 2004లో మీరు వాగ్ధానం చేశారు. 2014 వచ్చింది. మీ ప్రభుత్వం తొలి దఫా(2004-2009)లో ఏమీ చేయలేదు. రెండో దఫా (2009-2014)లో సైతం, 15వ లోక్‌సభ చివరి సమావేశం, చివరి వారంలో మీరు బిల్లును తీసుకొచ్చారు. 21వ తేదీన సమావేశాలు ముగుస్తాయి. ఈరోజు 18. కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నాయి. మీరు విషయాన్ని లాగుతూ, లాగుతూ.. ఇక్కడి దాకా తీసుకొచ్చారు. 

 
ఎలా తీసుకొచ్చారంటే.. మీ పార్టీ వాళ్లు కూడా దీన్ని అంగీకరించట్లేదు. మీరు మీ పార్టీ వాళ్లనే ఒప్పించలేకపోయారు, మీరు మీ మంత్రులనే ఒప్పించలేకపోయారు, మీరు మీ ముఖ్యమంత్రిని కూడా ఒప్పించలేకపోయారు. అధ్యక్ష జీ, ఏ సభా ఇలాంటి దృశ్యం చూసి ఉండదు. ప్రధానమంత్రి సభలో కూర్చుని ఉన్నారు.. ఆయన మంత్రి మండలిలోని మంత్రి వెల్‌లో నిలబడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సభలో కూర్చుని ఉన్నారు. అయినా ఫర్వాలేదంటూ ఆ పార్టీ సభ్యులు వెల్‌లోకి వచ్చి నిలబడ్డారు. ఆ పార్టీ ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చున్నారు. ప్రధానమంత్రి క్యాబినెట్‌లో బిల్లును ఆమోదిస్తే.. వాళ్ల ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకించి వెనక్కు పంపించారు. ఇలాంటి దృశ్యాలను ఈ సభలో చూస్తున్నాం. అధ్యక్ష జీ మేం కూడా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశాం. అడ్వాణీ ఇప్పుడు సభలో లేరు. 

 
కానీ, అప్పుడు ఆయన హోం శాఖ మంత్రి. ఆయన హయాంలోనే మూడు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ఒక్క రక్తపు చుక్క కూడా చిందలేదు. ఒక్క క్షణం కూడా సభలో అశాంతి లేదు. పూర్తి శాంతి, ఉత్సాహాలతో మూడు రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. మూడు రాష్ట్రాలూ ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఇప్పుడు పార్టీలన్నీ విడిపోయాయి, సీమాంధ్ర, తెలంగాణ నాయకులు ఒకచోట కూర్చోవడం లేదు, నామా నాగేశ్వరరావు ఉన్నారు.. ఆయన్ను నేను శాండ్ విచ్ అంటుంటాను. తెలంగాణ ప్రజలతో కలసి వస్తుంటారు. తెలంగాణను వ్యతిరేకించే వారితో కూడా కలసి వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీది కూడా ఇదే పరిస్థితి. జగన్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. అన్ని పార్టీలూ విడిపోయాయి.’’

 
(ఈ సమయంలో లోక్‌సభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. వెల్‌లోకి వచ్చిన సభ్యులు నినాదాలు, నిరసనలు కొనసాగిస్తున్నారు.)
‘‘నేను గర్వంగా చెప్పగలను.. ఇప్పుడు కూడా బీజేపీ సీమాంధ్ర, తెలంగాణ నాయకులు మాత్రం కలసికట్టుగా కూర్చుని, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సీమాంధ్ర నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.. తెలంగాణ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ కూడా తెలంగాణకే చెందాలి. కానీ, మాకు కూడా న్యాయం చేయండి' అని. న్యాయం కోసం వాళ్లు ఏం కోరుకుంటున్నారు? హైదరాబాద్‌లో రూ.1500 కోట్ల మిగులు ఆదాయం ఉంటే దాంతో తెలంగాణకు మేలు జరుగుతుంది. మరి కోస్తాంధ్ర, రాయలసీమకు జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? దాన్ని కేంద్ర ప్రభుత్వమే పూడ్చాలి. 

 
హోం మంత్రి హామీతో ఇది నెరవేరదు. నిధులు ఇచ్చే ఏర్పాటు చేయండి. వారి నష్టాన్ని పూడ్చే మాట చెప్పండి. మరోమాట వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 148 సంస్థలు ఉన్నాయి, పదేళ్లపాటు అది సంయుక్త రాజధాని. కానీ, సీమాంధ్రలో ఏర్పాటు కావాల్సిన సంస్థలకు సూత్రప్రాయంగా ప్రణాళికా సంఘం నుంచి అనుమతి ఇవ్వండి. వాటికి టోకెన్ అమౌంట్‌గా కొంత నిధులు ఇవ్వండి. మధ్యంతర బడ్జెట్ రూపంలో వాటిని నిధులు సమకూర్చండి. వారు చెబుతున్న మూడో మాట.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటున్నారు. దానికోసం మండలాల బదిలీ జరగాల్సి ఉంది. దీనిపై వెంకయ్యనాయుడు సమక్షంలో వారి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు జైరామ్ రమేశ్ లేఖ మా వద్ద ఉంది. కానీ, దీన్ని క్యాబినెట్‌లో మార్చేశారు. ఒప్పందం ప్రకారం వాటిని బదిలీ చేయండి. 

 
అందుకే అధ్యక్ష జీ.. తెలంగాణ ఏర్పాటు కావాలి. హైదరాబాద్ కూడా తెలంగాణలోనే ఉండాలి. అయితే, సీమాంధ్ర వారికి కూడా న్యాయం జరగాలి. అందుకే ఇవన్నీ బిల్లులో ఉండాలి. ఇది నా కోరిక. ఈ బిల్లులో గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టారు. ఇలాంటి శక్తులు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంటుంది. సాధారణ బిల్లుతో పాటు రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీసుకొస్తే మేం మద్దతు ఇస్తామని ప్రభుత్వానికి చెప్పాం. లోపాల బిల్లు తీసుకురావొద్దు.. అసలైన బిల్లు తీసుకురండి అని చెప్పాం. ఈ బిల్లు ఆమోదం పొందగానే బయటకు వెళ్లి పాటలు పాడతారు. ''కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. సోనియా అమ్మ తెలంగాణ ఇచ్చింది'' అంటారు. సోనియా అమ్మను గుర్తుంచుకుంటే.. ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండి. తెలంగాణకు మద్దతు ఇస్తామని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు కాబట్టి, జన చేతన యాత్రలో మా సీనియర్ నాయకుడు అడ్వానీ మాట ఇచ్చారు కాబట్టి మేం ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. 

 
మా విశ్వసనీయత కోసం మద్దతు ఇస్తున్నాం. ఏ రాజకీయ పార్టీకైనా, నాయకుడికైనా విశ్వసనీయతే ముఖ్యం. మనం ఏదైనా చెబితే ఎదుటివాళ్లు దానిపై నమ్మకం ఉంచాలి. అందుకే మేం ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం. హోం మంత్రి సమాధానం ఇచ్చేప్పుడు సీమాంధ్రకు న్యాయం చేయాలని నేను చెప్పినవన్నీ ఈ బిల్లులో పెట్టాలని నేను కోరుతున్నాను. అలా సీమాంధ్రులు కూడా సంతోషిస్తారు. ఒకవేళ అలా చేయకుంటే.. రాబోయే ప్రభుత్వం మాదే. మేం న్యాయం చేస్తాం అని నేను ఇక్కడ నిలబడి చెబుతున్నాను. సీమాంధ్రవాళ్లూ.. బాధపడకండి. మీ భద్రతకు మాది పూచీ. ఈ హామీ ఇస్తూ నేను ఈ బిల్లుకు మద్దతు పలుకుతున్నాను. ఈ బిల్లు ఆమోదానికి మద్దతు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.''

 
లోక్‌సభలో ఓటింగ్ ముగిసిన తర్వాత టీఎంసీ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. ''కాంగ్రెస్, బీజేపీ ఏక్ హై'' అని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఏకమైపోయాయని వారు నిందించారు.

 
బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. ''బిల్లును సభలో పెట్టాలి. కానీ, అది ఆమోదం పొందకూడదు. దీనికి కారణం బీజేపీనే అని నిందించాలి. బిల్లు పెట్టడం ద్వారా తెలంగాణ వారిని, దాన్ని ఆమోదించకుండా సీమాంధ్ర వారిని సంతృప్తిపర్చాలి'.. ఇదే కాంగ్రెస్ ప్లాన్. ఇది మాకు స్పష్టంగా అర్థమయ్యింది. దీంతో సభలో ఆందోళనలు జరుగుతున్నా సరే మేం బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే మేం మా వైఖరిని మార్చుకున్నాం. బిల్లుకు మద్దతు ఇచ్చాం' అని చెప్పారు.

 
ఈ విషయంలో అడ్వాణీకి, తనకూ మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవని ఆమె వెల్లడించారు. ''తెలంగాణ ఏర్పడినందుకు ఆయన (అడ్వాణీ) విచారించటం లేదు. ఆయన తన యాత్ర సందర్భంగా తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వటం ద్వారా ఆ హామీని నేను ఇప్పుడు నెరవేర్చాను. ఆయన ఎందుకు బాధపడుతున్నారంటే.. ఈరోజు సభలో జరిగిన పరిణామాలను చూసి. పైగా మా పార్టీ వైఖరిని అడ్వాణీ నివాసంలో, ఆయన నేతృత్వంలో పార్టీ సీనియర్ నాయకులంతా కలసి నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారమే నడుచుకున్నాం'' అని వివరణ ఇచ్చారు.

 
'తెలంగాణ చిన్నమ్మ..ఆమె కోరిక అదే' - నామా నాగేశ్వరరావు
తెలంగాణ ప్రాంత ప్రజలు తనను తమ చిన్నమ్మగా గుర్తుంచుకోవాలన్నదే సుష్మా స్వరాజ్ కోరిక అని ప్రస్తుతం టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఉన్న నామా నాగేశ్వరరావు అన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''అప్పట్లో నేను తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఉన్నాను. దీంతో ఇటు తెలంగాణ నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే నాయకులను జాతీయ స్థాయి నాయకుల వద్దకు నేనే తీసుకెళ్లాల్సి వచ్చేది. అలా ఆమెను చాలాసార్లు కలిశాను. లోక్‌సభ కార్యకలాపాలను నిర్ణయించే బీఏసీ సమావేశంలో తెలంగాణ గురించి మాట్లాడాలని నేను అడిగినప్పుడల్లా సుష్మా స్వరాజ్ నాకు మద్దతు ఇచ్చేవారు. తెలంగాణ చిన్నమ్మగా తనను గుర్తు పెట్టుకోవాలన్నది ఆమె కోరిక. తప్పకుండా మేమంతా ఆమెను అలా గుర్తుంచుకుంటాం’’ అని చెప్పారు.

 
ఆగస్టు 6వ తేదీ రాత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ ద్వారా సుష్మాకు నివాళులర్పించారు. ‘‘కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాను. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమె ఇచ్చిన మద్దతును తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. శాంతి చిన్నమ్మా.’’

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు