చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..

మంగళవారం, 19 జనవరి 2021 (22:31 IST)
చైనాలోని పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్ గురించి వాస్తవాలను రిపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న విదేశీ జర్నలిస్టులపై భారీ ఆంక్షలు విధించడమే కాక చైనా మరో కొత్త వ్యూహాన్ని కూడా అవలంబిస్తోంది. స్వతంత్ర్య మీడియా కవరేజ్‌ను "నకిలీ వార్తలు" (ఫేక్ న్యూస్)" అని ముద్ర వేస్తోంది. రాత్రి పూట జిన్జియాంగ్ నిర్మానుష్య హైవేలమీద ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని గుర్తు తెలియని కార్లు మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయని గమనించాం. మేము అక్కడకి వెళ్లిన క్షణం నుంచీ అవి మా వెనకే వస్తున్నాయి. హైవే మీద అవి వేగంగా దూసుకొస్తూ, ప్రమాదకరం అనిపించేంత దగ్గరగా వస్తూ ఉన్నాయి.

 
ఆ వాహనాల్లో ఉన్నవాళ్లు ఎవరో మాకు తెలీదు. కానీ నగరాన్ని విడిచి వెళ్లిపొమ్మని మాపై ఒత్తిడి తెచ్చారు. రెస్టారెంట్లకు, షాపులకూ మా వెనకే వచ్చారు. మాకు ఏమీ అందించవద్దని యజమనులకు చెప్పారు. ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతూ కూడా, చైనా ప్రభుత్వ పాలసీ పత్రాల ఆధారంగా మేము తయారుచేసిన నివేదికలో కొన్ని కొత్త సాక్ష్యాలు ఉన్నాయి. వీగర్ ముస్లింలను, ఇతర మైనారిటీ వర్గాల ప్రజలను పత్తిని సేకరించే పనిలో బలవంతంగా ప్రవేశపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పండించే పత్తి పంటలో ఐదవ వంతు ఇక్కడ పండుతుంది.

 
అయితే, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నడిపే మీడియా మా రిపోర్టుల గురించి వారి సొంత నివేదికను ప్రచురించింది. అక్కడ జరుగుతున్నవాటిని బీబీసీ అతి చేసి చూపిస్తోందని, మా రిపోర్టులన్నీ ఫేక్ న్యూస్ అని అరోపించింది. దీనికి సంబంధించి ఇంగ్లిష్ వార్తా పత్రిక్ 'చైనా డైలీ' రూపొందించిన ఒక వీడియోను చైనీస్ సోషల్ మీడియా సైట్లలోనూ, చైనాలో నిషేధించిన అంతర్జాతీయ వెబ్‌సైట్లలో కూడా ప్రచురించారు.

 
చైనా అసాధారణ దాడి
"ఇంగ్లిష్‌లో ఇంత తీవ్ర విమర్శనాత్మక దాడి, చైనీస్ సబ్‌టైటిల్స్‌తో సహా ప్రచురించడం అరుదైన విషయం" అని ఆక్స్‌ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన హన్నా బెయిలీ అభిప్రాయపడ్డారు. చైనా ప్రభుత్వ సహాయంతో డిజిటల్ సైట్లలో ప్రచారమయ్యే తప్పుడు సమాచారాన్ని ఆ దేశం ఎలా ఉపయోగిస్తుందనే అంశంపై బెయిలీ పరిశోధన చేస్తున్నారు.

 
"జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోను రూపొందించారు. చైనా ఇంతకముందు అవలంబించిన వ్యూహాలకన్నా ఇది కాస్త భిన్నమైనది. సాధారణంగా మెయిన్‌ల్యాండ్ చైనాలో ఉన్నవారికోసం ప్రచురించే వాటిల్లో పశ్చిమ దేశాలను విమర్శిస్తూ, జాతీయవాదాన్ని పెంపొందించే విధంగా సమాచారాన్ని పొందుపరుస్తారు. కానీ, అంతర్జాతీయ వినియోగదారులకోసం మాత్రం మధ్యస్థంగా, కొంత రాజీ ధోరణిలో సమాచారం ఉంటుంది" అని బెయిలీ అన్నారు.

 
నీడలా వెంటాడారు
కూకా నగరంలో ఒక టెక్స్‌టైల్ మిల్లు ప్రధాన ద్వారం బయట బీబీసీకి కొంతమంది మేనేజర్లు, స్థానిక అధికారులకు జరిగిన వాగ్వివాదంపై చైనా డైలీ రిపోర్ట్ దృష్టి కేంద్రీకరించింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఒక పోలీసు అధికారి అందించిన బాడీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా చైనా డైలీ, బీబీసీపై ఆరోపణలు చేసింది. బీబీసీ బృందానికి, పోలీసు అధికారికి మధ్య జరిగిన తేలికపాటి చర్చను చూపిస్తూ...బీబీసీ దీన్ని పెద్దది చేసి చూపిస్తోందంటూ ఆరోపించింది. చైనా అధికారులు మమ్మల్ని రిపోర్ట్ చెయ్యనివ్వకుండా అడ్డుకుంటున్నారని బీబీసీ ప్రచురించింది అంటూ దృష్టిని అంతటినీ ఆ సంఘటన మీదకు మళ్లించింది.

 
అయితే, బీబీసీ బృందం వద్ద ఉన్న కొన్ని ఫుటేజ్‌లను అక్కడి అధికారులు బలవంతంగా డిలీట్ చేయించారన్న విషయాన్ని మటుకు చైనా డైలీ తెలుపలేదు. అంతేకాకుండా మా వద్ద మిగిలిన ఫుటేజ్‌లను కూడా సమీక్షించారు. అసలు మొత్తం విషయం గురించి విస్తృత పరిధిలో వివరణ ఇవ్వలేదు సరి కదా మాపై వచ్చిన ఆరోపణలకు జవాబు ఇచ్చే అవకాశాన్ని కూడా బీబీసీకి ఇవ్వలేదు.

 
ఫుటేజ్ డిలీట్ చేయించారు
జిన్జియాంగ్ ప్రాంతంలో మేము దాదాపు 72 గంటలపాటూ పర్యటించిన సమయంలో మమ్మల్ని దారంతా వెంబడిస్తూనే ఉన్నారు. కనీసం అయిదుసార్లు పబ్లిక్ స్థలాల్లో షూటింగ్ చెయ్యకూడదని మమ్మల్ని వారించారు. కొన్నిసార్లు బలవంతంగా ఆపడానికి ప్రయత్నించారు. మమ్మల్ని ఆపడానికి వాళ్లు మా కెమేరా ముందుకు వచ్చారు. దాంతో మేము వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నామంటూ మాపై నేరం మోపారు. కనీసం రెండు సార్లు ఇలాంటివి జరిగి ఉంటాయి.

 
రెండుసార్లు మేము షూట్ చేసిన ఫుటేజ్‌లను డిలీట్ చేశారు. మరొకసారి, పంటపొలాలను చిత్రీకరించడం ద్వారా రైతు హక్కులను ఉల్లంఘిస్తున్నామంటూ మమ్మల్ని కొద్దిసేపు నిర్బంధించారు. జిన్జియాంగ్ కవరేజ్ తమ అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బ తీస్తుందని భావించడం వల్లే చైనా ఇలాంటి ప్రోపగాండాకు పూనుకున్నదేమో అనే సందేహం కలుగక మానదు.

 
కానీ, స్వదేశంలో విదేశీ మీడియాపై దాడి ప్రయత్నాలు అంత మంచిది కాదు. దానివల్ల ఇంతవరకూ పబ్లిక్‌లోకి రాని కొన్ని కథనాలను బయటపెట్టినట్టు అవుతుంది. కూకా టెక్స్‌టైల్ మిల్లుకు, రీ-ఎడ్యుకేషన్ క్యాంపుకు మధ్య పెద్ద సంఖ్యలో జనాలు తరలించారని 2019 మేలో తీసిన ఉపగ్రహ చిత్రం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో అంతర్గత భద్రతకోసం నాలుగువైపులా గోడలు ఉన్నాయి, ఒక వాచ్‌టవర్ కూడా ఉంది.

 
ఈ క్యాంపును 'వృత్తివిద్య శిక్షణా శిబిరం' అని వ్యవహరిస్తూ, అక్టోబర్ 2019లోనే మూసేసిన దాన్ని చిత్రీకరించడానికి బీబీసీ వృధా ప్రయత్నం చేస్తోందంటూ చైనా డైలీ ప్రచురించింది. అయితే, ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం ద్వారా అక్టోబర్‌లో ఈ శిబిరాన్ని మూసి వేయలేదని, పని చేస్తూనే ఉందని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే, ఇక్కడ మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని నిర్థారణ అవుతోంది.

 
ఆ ఫొటోలో కనిపిస్తున్న వాళ్లు ఎవరు? వాళ్లని శిబిరానికి, ఫ్యాక్టరీకి మధ్య ఎందుకు తరలిస్తున్నారు? అక్కడ జరుగుతున్న పని వాళ్ల మీద బలవంతంగా రుద్దారా లేక వాళ్లు ఇష్టపడే చేస్తున్నారా...ఇలాంటి విషయాలన్నిపైనా దర్యాప్తు చేయాల్సి ఉంది. బాడీ కెమేరా ఫుటేజ్‌లను అందజేసిన పోలీస్ అధికారిని చైనా డైలీ చేసిన ఇంటర్వ్యూ చూస్తే జిన్జియాంగ్ ప్రాంతంలో జర్నలిస్టులపై ఎంత ప్రణాళికాబద్ధమైన నిఘా ఉంచారో బోధపడిపోతుంది.

 
మేము కూకా చేరుకున్న కొద్దిసేపట్లోనే మా హోటల్ లాబీలో మీటింగ్ పెట్టి మా హక్కులు, పరిమితుల గురించి మమ్మల్ని హెచ్చరించినట్లు ఆ అధికారి అంగీకరించారు. నిజానికి, ఆ మీటింగ్ అయ్యేవరకు హోటల్‌నుంచీ బయటకు వెళ్లడానికి మాకు అనుమతి లేదని హోటల్ సిబ్బంది మాకు ముందే చెప్పారు. ఆ పోలీసు అధికారితో పాటూ మరో ఇద్దరు ప్రోపగాండా అధికారులు కూడా ఆ మీటింగ్‌కు వచ్చారు. మేము కూకాలో ఉన్నంతవరకూ వాళ్లిద్దరూ మా వెంటే ఉంటారని చెప్పారు. అప్పటికే మా వెనుక వస్తున్న కార్లకు తోడు వీళ్ల కారు కూడా మమ్మల్ని అనుసరించింది.

 
మా రిపోర్ట్‌ను ఫేక్ న్యూస్ అని ప్రచారం చేయడం, దానిపై చైనా డైలీ రూపొందించిన కార్యక్రమం, మమ్మల్ని వెంబడిస్తూ వచ్చిన కార్లు...ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసిన ప్రయత్నాలని, మేము అందించే కథనంపై నియంత్రణ కొనసాగించే ప్రయత్నాలని తెలుస్తోంది. మేము బీజింగ్‌కు తిరిగి వచ్చిన తరువాత అక్కడి అధికారులు మమ్మల్ని పిలిచి...ఆ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీని చిత్రీకరించడానికి ముందే దాని యజమానుల అనుమతి తీసుకుని వెళ్లాల్సింది అని అన్నారు.

 
బహిరంగ స్థలంలో ఉన్న భవనాన్ని చిత్రీకరించడం చైనా మీడియా నిబంధనలకు వ్యతిరేకం కాదని మేము చెప్పాం. విదేశీ జర్నలిస్టుల అక్రిడిటేషన్ విధానాన్ని ఒక నియంత్రణ సాధనంగా చైనా ఉపయోగిస్తోంది. తక్కువ రోజులకే వీసాలు ఇవ్వడం, జర్నలిస్టులు చేసిన కవరేజ్‌ను చైనా అంగీకరించని పక్షంలో వారి వీసాలను రెన్యువల్ చేయకపోవడంలాంటివన్నీ చేస్తోంది.

 
నా రిపోర్ట్ పబ్లిష్ అయిన తరువాత, నాకు కొద్ది కాలానికే వీసా ఇచ్చారు. జిన్జియాంగ్ రిపోర్ట్ కారణంగానే వీసా కాలాన్ని తగ్గించారని అధికారులు చెప్పారు. బీబీసీ రహస్య కెమేరా ఉపయోగించిందని చైనా డైలీ ఆరోపించింది. కానీ మేము అలాంటిది ఏమీ వాడలేదు. "అంతర్జాతీయ దృక్కోణాన్ని చైనా విమర్శించే విధానం ఇప్పుడు మరింత రక్షణాత్మకంగా మారిందని" హన్నా బెయిలీ అన్నారు.

 
"జాతీయ, అంతర్జాతీయ సమాచారాన్ని ప్రభావితం చేయడానికి చైనా అనేక రకాల సాధనాలను ఉపయోగిస్తుంది. విదేశీ మీడియాపై అవిశ్వాసాన్ని కలుగజేయడం కూడా అలాంటి ఒక సాధనమే" అని ఆమె అభిప్రాయపడ్డారు. తాను రూపొందిన రిపోర్ట్‌లో ఉన్న తప్పులపై వ్యాఖ్యానించాలని చైనా డైలీని మేము కోరాం. మేము అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు కానీ "జిన్జియాంగ్‌లో ఎవ్వరినీ బలవంతంగా పనిలోకి దింపలేదని" తేల్చి చెప్పింది.

 
చైనా డైలీ ప్రోపగాండా వీడియోలో ఆఖరుగా ఒక టెక్స్‌టైల్ మిల్లు కార్మికురాలిని "ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని అడిగారు. "నేను ఇక్కడ నా ఇష్ట ప్రకారమే పనిచేస్తున్నాను" అని ఆమె జవాబిచ్చారు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నియంత్రణలో ఉన్న జర్నలిస్టుల దగ్గరనుంచీ ఇలాంటి ప్రశ్న వస్తుందని ఆమెకు ముందే తెలుసు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు