#100WOMEN: 'బీబీసీ 100 ఉమన్’లో భారతీయులు ఎంత మంది?
మంగళవారం, 22 అక్టోబరు 2019 (18:12 IST)
'బీబీసీ 100 ఉమన్' సిరీస్ 2013 నుంచి ఏటా స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన 100 మంది మహిళల గాథలను ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, వీక్షకుల ముందుకు తెస్తోంది.
మేకప్ ఎంట్రప్రెన్యూయర్ బాబీ బ్రౌన్, ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్, బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్, అథ్లెట్ సిమోన్ బైల్స్, సూపర్ మోడల్ అలెక్ వెక్, మ్యుజీషియన్ అలీసియా కీస్, ఒలంపిక్ చాంపియన్ బాక్సర్ నికోలా ఆడమ్స్- ఇలా వేర్వేరు రంగాల మహిళలు గత సంవత్సరాల్లో 'బీబీసీ 100 వుమన్'కు ఎంపికయ్యారు.
ఈసారి ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 100 మంది మహిళల జాబితా విడుదలైంది.
ఇందులో ఏడుగురు భారతీయులు ఉన్నారు. వారి వివరాలు ఇవీ...
అరణ్య జోహర్, కవయిత్రి
స్త్రీ-పురుష సమానత్వం, మానసిక ఆరోగ్యం, శారీరక లక్షణాలను బట్టి వివక్ష చూపడం లాంటి అంశాలపై అరణ్య తన కవిత్వంతో స్పందిస్తుంటారు. 'బీట్ పోయట్రీ' అనే రూపంలో ఆమె కవిత్వం రాస్తారు. 'ఎ బ్రౌన్ గర్ల్స్ గైడ్ టు బ్యూటీ' పేరుతో ఆమె వీడియో రూపంలో ఇంగ్లిష్‌లో ఇచ్చిన ప్రదర్శనను యూట్యూబ్‌లో 30 లక్షల మందికి పైగా చూశారు. అరణ్య ముంబయిలో ఉంటారు.
భవిష్యత్తుపై అరణ్య విజన్: "మహిళలందరూ ప్రపంచ కార్మికశక్తిలో భాగమై ఉంటే అంతర్జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 28 ట్రిలియన్ డాలర్ల మేర పెరిగేది. ప్రపంచ జనాభాలో సగమైన మహిళలకు, వారి ప్రతిభాసామర్థ్యాలకు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తున్నారు? స్త్రీ-పురుష సమానత్వం సాకారమైన ప్రపంచం ఎలా ఉంటుంది? మనం దీనిని సాధించడానికి ఇంకెంత దూరంలో ఉన్నాం?"
సుస్మితా మొహంతి, 'అంతరిక్ష 'వ్యాపారవేత్త
సుస్మితను 'భారత అంతరిక్ష మహిళ'గా పిలుస్తారు. వ్యోమనౌక రూపశిల్పి అయిన సుస్మిత.. భారత్‌లో తొలి అంతరిక్ష స్టార్టప్‌ను స్థాపించారు. వాతావరణ మార్పుల నియంత్రణ కోసం ఆమె తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణ మార్పులను అంతరిక్షం నుంచి గమనించి అర్థం చేసుకోవడంలో ఆమె తన సంస్థ ద్వారా తోడ్పాటు అందిస్తున్నారు. సుష్మిత బెంగళూరులో ఉంటారు.
భవిష్యత్తుపై సుస్మిత విజన్: "మూడు, నాలుగు తరాల తర్వాత మన భూగ్రహం జనావాసానికి అంత అనుకూలంగా ఉండదనే ఆందోళన నాకుంది. వాతావరణ మార్పులపై పోరాటానికి మానవాళి తక్షణం నడుం బిగిస్తుందని ఆశిస్తున్నా."
వందనా శివ, పర్యావరణవేత్త
చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా 1970ల్లో మహిళలు చేపట్టిన ఉద్యమంలో వందన పాల్గొన్నారు. నాడు మహిళలు చెట్లను ఆలింగనం చేసుకొని, వాటిని తొలగించడాన్ని అడ్డుకున్నారు.
ఇప్పుడు వందన ప్రపంచవ్యాప్తంగా తెలిసిన పర్యావరణ ఉద్యమకారిణి. 'ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్' విజేత. మహిళలే ప్రకృతి పరిరక్షకులని ఆమె చెబుతారు.
భవిష్యత్తుపై వందన విజన్: "విపత్తు, పతనం నుంచి మానవాళిని కాపాడే కార్యక్రమానికి మహిళలే నాయకత్వం వహిస్తారని, అందరి ఉమ్మడి భవిష్యత్తుకు వారే పునాది వేస్తారని నేను ఆశిస్తున్నాను."
నటాషా నోయెల్, యోగా నిపుణురాలు
నటాషా నోయెల్ ప్రముఖ యోగా నిపుణురాలు (యోగిని). 'బాడీ పాజిటివిటీ' అంశంలో ప్రభావశీల వ్యక్తుల్లో ఆమె ఒకరు (ఇన్‌ఫ్లుయన్సర్). కేరళకు చెందిన నటాషా ముంబయిలో ఉంటున్నారు.
విషాదమయమైన తన బాల్యం గురించి ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. ఆమె మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. బాల్యంలో లైంగిక దాడికి గురయ్యారు.
భవిష్యత్తుపై నటాషా విజన్: "ప్రపంచంలో ప్రతి మనిషీ సాధికారతతో బతికగలిగే రోజు రావాలనేది నా ఆశ.
అందరికీ సమానంగా అవకాశాలు, ప్రాథమిక స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఉండాలి. ప్రతి ఒక్కరు తమ భావోద్వేగ స్థితిని, మేధో స్థితిని పెంచుకొనేందుకు ప్రయత్నించాలి. తద్వారా ప్రతి మనిషి సంపూర్ణ చైతన్యంతో వ్యవహరించగలరు."
ప్రగతి సింగ్, డాక్టర్
వైద్యురాలైన ప్రగతి సింగ్ అలైంగికత (అసెక్సువాలిటీ) గురించి పరిశోధన ప్రారంభించినప్పుడు, తమకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అయితే తమకు శృంగారంలో పాల్గొనాలని లేదని ఆందోళన వ్యక్తంచేస్తూ పలువురు మహిళల నుంచి ఆమెకు సందేశాలు వచ్చాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, శృంగారం లేని బంధాల కోసం చూస్తున్నవారు ఒకరినొకరు కలుసుకొనేందుకు వీలుగా ఆమె కార్యక్రమాలు చేపట్టారు. అలైంగిక (అసెక్సువల్) వ్యక్తుల కోసం ఆమె 'ఇండియన్ ఏసెస్' అనే ఆన్‌లైన్ కమ్యూనిటీని నడుపుతున్నారు. ఆమె దిల్లీలో ఉంటారు.
భవిష్యత్తుపై ప్రగతి విజన్: "సహానుభూతి లాంటివి స్త్రీ లక్షణాలు. మన స్త్రీవాదంలో ఈ లక్షణాలను మరింతగా అలవర్చుకోవడానికి ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమైంది."
శుభలక్ష్మి నంది, లింగ సమానత్వం నిపుణురాలు
'ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ వుమన్'కు చెందిన శుభలక్ష్మి ఆసియాలో లింగ సమానత్వ సాధన కోసం 15 ఏళ్లకు పైగా కృషి చేస్తున్నారు.
ఆమె దృష్టి కేంద్రీకరించే అంశాలు- మహిళా రైతుల హక్కుల పరిరక్షణ, మహిళలపై హింసను నియంత్రించడం, మహిళల విద్యను మెరుగుపర్చడం. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆమె దిల్లీలో ఉంటున్నారు.
భవిష్యత్తుపై ఆమె విజన్: "మున్ముందు మహిళలను ఏ మాత్రం విస్మరించలేరు. పొలాల్లో, అడవుల్లో, కర్మాగారాల్లో, వీధుల్లో, ఇళ్లలో- ఇలా అన్ని చోట్ల మహిళలు చేసే పనిని గుర్తించక తప్పదు. మహిళలు వారంతట వారే వ్యవస్థీకృతమవుతారు. మొత్తం ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని నడిపించేందుకు తాము చేస్తున్న కృషి గురించి వారే ఇంకా మెరుగ్గా ప్రపంచానికి చాటి చెబుతారు. మహిళలు చేసే పనిని వేతనమున్న పనిని, వేతనంలేని పనిని రెండింటినీ ప్రభుత్వ గణాంకాల్లో, విధాన నిర్ణయాల్లో పరిగణనలోకి తీసుకొనే రోజు వస్తుంది."
పర్వీనా అహంగర్, కశ్మీర్లో మానవ హక్కుల కార్యకర్త
పర్వీనాను 'కశ్మీర్ ఉక్కు మహిళ'గా పిలుస్తారు. కశ్మీర్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున ఆందోళనలు జరుగుతున్న సమయంలో 1990లో టీనేజ్‌లో ఉన్న ఆమె కుమారుడు కనిపించకుండాపోయాడు.
కశ్మీర్లో కనిపించకుండాపోయిన వేల మందిలో అతడు ఒకడు. ఇలా అదృశ్యమైన వ్యక్తుల తల్లిదండ్రులతో పర్వీనా ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని పేరు 'అసోసియేషన్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ డిజప్పియర్డ్ పర్సన్స్ (ఏపీడీపీ).'
తన కొడుకును మళ్లీ చూస్తాననే నమ్మకం తనకుందని ఆమె చెబుతున్నారు. అతడు కనిపించకుండాపోయి వచ్చే సంవత్సరానికి 30 ఏళ్లవుతుంది.
భవిష్యత్తుపై పర్వీనా విజన్: "ప్రభుత్వం కల్పించిన పరిస్థితుల వల్ల నా కొడుకు కనిపించకుండాపోయాడు. అతడు దూరమయ్యాడనే బాధే- న్యాయం, జవాబుదారీతనం కోసం నేను చేస్తున్న పోరాటానికి ప్రేరణ కలిగిస్తోంది. ఈ ప్రపంచం మెరుగ్గా ఉండేలా ముఖ్యంగా మహిళలకు బాగుండేలా నేను కృషి చేయాలనుకొంటున్నాను. నేటి ప్రపంచంలో మహిళల అంశాలకు ముఖ్యంగా యుద్ధ క్షేత్రాల్లో, ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో బతికే మహిళల అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది."
ఈ నెల 22న దిల్లీలో జరిగే 'బీబీసీ 100 వుమన్' సదస్సులో ఈ జాబితాలో స్థానం పొందిన భారతీయులను కలుసుకోవచ్చు.