తీహార్ జైలులో ఖైదీకి కరోనా - వుహాన్‌లో మళ్లీ వైరస్ అలజడి

సోమవారం, 11 మే 2020 (14:52 IST)
ఢిల్లీలోని తీహార్ జైలులో ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జైలు వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అత్యాచార ఆరోపణల కింద అరెస్టు అయి తీహార్ జైలుకు వచ్చిన ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర జైలు సిబ్బంది, అధికారులను కూడా హోం క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, ఆ ఖైదీ ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారో తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అదేసమయంలో జైలు సిబ్బందిలో కూడా ఆందోళన నెలకొంది. 
 
మరోవైపు, కరోనా వైరస్ పురుడు పోసుకున్న వుహాన్ నగరంలో మళ్లీ కలకలం చెలరేగింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో వుహాన్‌లో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా, లాక్డౌన్ ఎత్తివేసి ఆఫీసులు, కొన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, మ్యూజియంలు, ఇతర వినోద కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. 
 
దీంతో కరోనా వైరస్ సద్దుమణిగిందని వుహాన్ వాసులు భావించారు. అయితే, తాజాగా ఇక్కడ కరోనా కలకలం మళ్లీ మొదలైంది. ఒకే కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న ఐదుగురు వ్యక్తులతో పాటు మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా బారినపడినవారిలో ఓ వృద్ధురాలు కూడా ఉంది. ఆమె భర్తకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా నిర్ధారణ అయిన ఐదుగురిలోనూ ఎలాంటి లక్షణాలు లేకపోవడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు