కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. అయితే స్కూళ్లు రీ-ఓపెనింగ్ చేసే అంశంపై కసరత్తు జరుగుతూనే వున్నాయి. నిజానికి రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూళ్లు తెరుద్దామన్నా... తమ పిల్లల్ని పంపడానికి దాదాపు 80 శాతం మంది తల్లిదండ్రులు ఆసక్తిగా లేరు. ఎందుకంటే... కరోనా సోకదని గ్యారెంటీ ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల్ని ఇళ్లలోనే ఉంచుకొని చదివించుకుంటాం తప్ప... స్కూలుకు పంపే ప్రసక్తే లేదంటున్నారు.
అలాగే తెలుగు రాష్ట్రాలతోపాటూ దాదాపు 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. అందువల్ల ఇప్పటికే చాలా వరకూ సడలింపులు ఇచ్చేసినా స్కూల్స్ ఎప్పుడు తెరవాలనే అంశం అన్ని రాష్ట్రాలకూ ప్రశ్నగానే ఉంది. కొన్ని రాష్ట్రాలు ఫలానా తేదీ నుంచి తెరుస్తామని ప్రకటించాయి.
ఐతే... అన్‌లాక్ 5 మార్గదర్శకాలు... మరో నెలపాటూ అంటే నవంబర్‌లోనూ కొనసాగుతాయన్న కేంద్రం... స్కూళ్లు ఎప్పుడు తెరవాలనే అంశంపై క్లారిటీ ఇస్తూ మరో ఆర్డర్ జారీ చేసింది. కరోనాకి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదు. కేంద్ర అధికారులు మరో సంవత్సరం పడుతుందని అంటున్నారు. అందువల్లే స్కూల్స్ తెరిచే విషయంలో కేంద్రం లోతుగా ఆలోచిస్తోంది.