ఆ ప్రతిపాదనే కోహ్లీ కొంపముంచిందా? అందుకే గౌరవంగా తప్పుకున్నాడా?

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:49 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై సర్వతా షాక్ వెల్లడైంది. టీ20 ఫార్మట్ కి కెప్టెన్‌గా తప్పుకుంటున్నానంటూ కోహ్లీ అధికారికంగా ప్రకటించాడు. యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్‌గా వైదొలుగుతున్నానంటూ ఇన్‌స్టా వేదికగా పెద్ద లేఖ రాసారు.
 
అంతర్జాతీయ టెస్టులు, అంతర్జాతీయ వన్డే జట్లకు కెప్టెన్ గా ఉంటానంటూ చెప్పారు కూడా. ఐతే ఈ విషయమై కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్య ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ అయిన కెవిన్ పీటర్సన్, విరాట్ కోహ్లీ రాసిన పూర్తి వివరాలను మొత్తం చదివి కేవలం ఫైర్ అన్న ఎమోజీని మాత్రమే పెట్టాడు. 
 
అంటే కెవిన్ పీటర్సన్ ఏమన్నాడనేది అభిమానులేవరికీ అర్థం కాలేదు. టీ20 ఫార్మట్‌కి కెప్టెన్‌గా దిగిపోతున్నానని చెబితే ఫైర్ ఎమోజీ పెట్టడం ఏంటన్నది కన్ఫ్యూజింగ్‌గా మారింది. మరోవైపు టీమిండియా సారథి విరాట్​ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కోహ్లి కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడం ఖాయమైపోయింది. అయితే తదుపరి కెప్టెన్​గా ఎవరు ఉంటారు? అనే చర్చ క్రికెట్​ అభిమానుల్లో మొదలైంది.  
 
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ కంటే యంగ్ ప్లేయర్లకు టీ20 కెప్టెన్సీ ఇస్తే, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని కామెంట్ చేశాడు. తాజాగా విరాట్ కోహ్లీ ప్రతిపాదనపై చర్చ సాగుతోంది. టీమిండియా సెలక్షన్ కమిటీతో ఇటీవల టీ20 వరల్డ్‌కప్ జట్టు ఎంపిక గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఆ సమయంలో రోహిత్ శర్మని వైస్ కెప్టెన్ హోదా నుంచి తప్పించాలని ప్రతిపాదించాడట. కుర్రాళ్ల క్రికెట్‌గా పేరొందిన టీ20 వరల్డ్‌కప్‌లో 34 ఏళ్ల రోహిత్ శర్మని వైస్ కెప్టెన్‌గా కొనసాగించడం తగదని చెప్పుకొచ్చిన కోహ్లీ.. 29 ఏళ్ల కేఎల్ రాహుల్ లేదా 23 ఏళ్ల రిషబ్ పంత్‌కి ఆ బాధ్యతలు అప్పగించాలని సెలక్షన్ కమిటీని కోరినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో.. సెలక్షన్ కమిటీ సభ్యులు కూడా ఆశ్చర్యానికి గురైయ్యారట. 
 
దీనిపై బీసీసీఐలో తీవ్ర స్థాయిలో చర్చలు జరగగా.. అవి చివరికి కోహ్లీ టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఈ టోర్నీలో ఒకవేళ భారత్ జట్టుని కోహ్లీ విజేతగా నిలపలేకపోతే.. అతడ్ని టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐ పెద్దలు ప్రాథమికంగా నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో.. కోహ్లీనే గౌరవంగా కెప్టెన్సీ నుంచి ముందుగానే తప్పుకోబోతున్నట్లు ప్రకటించాడని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు