పహెల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఆగ్రహం చెందిన భారతదేశం దాయాది దేశం పాకిస్తాన్ భూభాగంలో నక్కి వున్న ఉగ్ర శిబిరాలపై దాడి చేసి మసి చేసింది. తమకు ఆయువుపట్టులా భావించే పాకిస్తాన్ ఇది తట్టుకోలేక భారతదేశంపై అప్రకటిత యుద్ధం చేసింది. డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడింది. మొత్తం 87 గంటల పాటు ఇరు దేశాల మధ్య డ్రోన్లు, క్షిపణులు, గగనతల దాడులు జరిగాయి. ఈ యుద్ధంలో ఏ దేశానికి ఎంత నష్టం వాటిల్లిందనే లెక్కలు బైటకు వచ్చాయి.
చక్ర డైలాగ్స్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం... పాకిస్తాన్ ఎడబ్ల్యుఎసిఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసంలో 35 మిలియన్ డాలర్లు, 8 మిలియన్ డాలర్ల విలువ చేసే షహీన్ మిస్సైళ్లు, 35 మిలియన్ డాలర్ల విలువ చేసే ఐఎల్-78 ట్యాంకర్లు, 6 మిలియన్ డాలర్ల విలువ చేసే టర్కీ డ్రోన్లు, 100 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎఫ్-16 ఫైటర్ల్.. ఇలా అన్నీ కలిపి 3.4 బిలియన్ డాలర్లు నష్టపోయింది. అంటే సుమారుగా పాకిస్తాన్ దేశం యుద్ధంలో రూ. 29,000 కోట్లు నష్టం చవిచూసింది.
ఇక భారతదేశం విషయానికి వస్తే... భారీ నష్టం జరగకుండా రష్యన్ తయారీ s-400 అడ్డుకున్నది. వచ్చిన డ్రోన్లను వచ్చినట్లే ఆకాశంలో పేల్చేసింది. మరోవైపు భారతదేశ శక్తివంతమైన గగనతల రక్షణ వలయం కారణంగా పాకిస్తాన్ వదిలిన ఏ అస్త్రం నియంత్రణ రేఖ దాటి భారీ నష్టాన్ని చేయలేకపోయింది. ఢిల్లీ పైకి గురిపెట్టి పాకిస్తాన్ వదిలిన ఫటాహ్ మిస్సైల్‌ను సైతం ఎస్-400 మసి చేసింది. ఆపరేషన్ సింధూర్ దాడిలో భారతదేశం 15 బ్రహ్మోస్ మిస్సైళ్లను పాకిస్తాన్ మిలటరీ ప్రాంతాల్లో వదిలింది.
ఈ మిస్సైల్ ఖరీదు ఒక్కోటి రూ. 34 కోట్లు. ఇలా మొత్తమ్మీద భారతదేశానికి రూ. 510 కోట్లు ఖర్చయ్యింది. ఇంత చిన్నమొత్తంతోనే పాకిస్తాన్ దేశంలో సుమారు 30 వేల కోట్ల రూపాయల మేర నష్టం చేసింది. దీనితో ఇప్పుడు పాకిస్తాన్ తన ఆయుధ సంపత్తిని మెరుగు పరుచుకునేందుకు అటు చైనా, ఇటు టర్కీలను అడుక్కుంటోంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు పాకిస్తాన్ దేశానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ పాకిస్తాన్ దేశాన్ని ఇంకా బికారి దేశంగా మార్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి పాకిస్తాన్ ప్రజల భవిష్యత్ ఏంటో?