యోగాతో వృద్ధ మహిళలకు స్థిరత్వం....

సోమవారం, 18 జూన్ 2018 (10:33 IST)
వృద్ధ మహిళలకు ప్రత్యేకంగా రూపొందించిన యోగా ప్రక్రియతో ముసలి వయస్సులో తూలి పడిపోకుండా శరీరాన్ని సమతూకంగా ఉంచుకోవచ్చని వైద్య పరిశోధకులు పేర్కొన్నారు. మహిళలకోసం ప్రత్యేకంగా రూపొందించిన యోగా ప్రోగ్రామ్‌లో 24 మంది వృద్ధ మహిళలల్లో శారీరక పటుత్వం, సమతుల్యత మెరుగుపడినట్లు నిర్ధారించారు.
 
9 వారాలు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న 65 ఏళ్ల వృద్ధ మహిళల నడకలో సమతూకం గణనీయంగా మెరుగుపడిందని ప్రకటించారు. యోగా కార్యక్రమంలో మహిళలు తమ నడకను ఎంతో మెరుగుపర్చుకున్నారని వారి పాదాల్లోని నరాలు పటుత్వం సాధించి వారి నడకకు స్థిరత్వం కల్పించాయని అధ్యయనంలో వెల్లడైంది.
 
గతంలో వృద్ధ మహిళలకు కఠినతరమైన యోగాభ్యాసం నేర్పించేవారని, ఈ కొత్త ప్రక్రియలో శ్వాస, నిలబడడం, యోగా భంగిమ వంటివి సరళరూపంలో మార్చి అభ్యాసం చేయించినట్లు పరిశోధనలో తెలిపారు. ఈ తాజా ప్రక్రియలో పాల్గొన్న కొందరు మహిళలకు వీపు నొప్పి, మోకాలి నొప్పి వంటివి పూర్తిగా తొలగిపోయినట్లు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు