అమ్మగా మారిన అమ్మమ్మ...21వ బిడ్జకు జన్మ.. ఎక్కడ?

మంగళవారం, 13 నవంబరు 2018 (09:11 IST)
సాధారణంగా ఒక బిడ్డను కనడమే కష్టం. అలాంటిది ఏకంగా 21 మందికి జన్మనిచ్చిందో మహిళ. కాదు.. ఓ అమ్మమ్మ. తన 43వ యేట ఓ పక్క పెద్ద కూతురు పండంటి పాపాయికి జన్మనిస్తే మరో పక్క అమ్మమ్మ అయిన అమ్మ కూడా 21వ బిడ్డకు జన్మనిచ్చింది. బాబోయ్.. ఎవరమ్మా ఆ మహాతల్లి దండేసి దండం పెట్టాలి అని విన్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లండన్‌కు చెందిన స్యూ ర్యాడ్‌ఫోర్డ్ అనే మహిళ తన భర్త నోయెల్ ర్యాడ్‌ఫోర్డ్‌తో కలిసి లాంక్‌షైర్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఓ బేకరీని నడుపుతూ, దానిపై వచ్చే ఆదాయంతో జీవనం జీవిస్తున్నారు. ఈ క్రమంలో తన 7వ యేటనే నోయల్‌తో ప్రేమలో పడిన స్యూ 13 ఏళ్ళకే పెళ్లి 14 ఏళ్లకే అమ్మగా మారి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తొలి కాన్పు తర్వాత ముగ్గురు పిల్లలతో సరిపెట్టుకోవాలని భార్యాభర్తలిద్దరూ భావించారట. 
 
కానీ, మనసెందుకో మరికొంత మంది కావాలని కోరిందట. దాంతో తొమ్మిదో బిడ్డ పుట్టిన తర్వాత బండికి బ్రేకులు వేద్దామనుకుని నోయల్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. అయినా పిల్లల మీద మళ్లీ మనసు పోయింది. దాంతో నోయల్ రీ కానలైజేషన్ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఫలితంగా నోయెల్ - స్యూ దంపతులకు పుట్టిన పిల్లల సంఖ్య 21కి చేరింది. తాజాగా ఆమె 21వ బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై స్యూ స్పందిస్తూ, ఇకపై తనకు ఇదే చివరికాన్పు. తానే వెళ్లి పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పింది. 
 
ఇంతమంది పిల్లలను వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతున్నారు. పైగా, ఈ పిల్లలందరినీ ఒకే పాఠశాలలో చదివిస్తూ, వారు వచ్చిపోయేందుకు ఏకంగా ఓ మినీ బస్సుని ఏర్పాటు చేసుకున్నారు. పిల్లల పట్ల అత్యంత బాధ్యత గల తండ్రిగా వ్యవహరిస్తాడు నోయల్. రోజూ రాత్రి గం. 7.30 ల కల్లా బేకరీ మూసేసి ఇంటికి వస్తాడు. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతాడు. శెలవు రోజుల్లో పిల్లలందర్నీ తీసుకుని బయటకు వెళతాడు.
 
2014లో ఒక కుమారుడు అల్ఫీ పుట్టిన 23 వారాలకు మరణించాడు. 2013లో ఈ జంట ఛానల్ 4 షో 16 కిడ్స్ అండ్ కౌంటింగ్‌లో నటించింది. 2012లో మరో బిడ్డకు జన్మనిస్తున్న సమయంలోనే ఒకసారి అమ్మమ్మ అయింది. మొదటి బిడ్డకు ఇద్దరు పిల్లలు, రెండో బిడ్డకు ఒకరు జన్మించగా స్యూ, నోయల్‌‌లు అమ్మమ్మ, తాతయ్యలు కూడా అయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు