అగ్రరాజ్యం అమెరికాలో కొత్త ప్రాంతాలను కరోనా వ్యాపిస్తోంది. న్యూయార్క్‌లో ఇంతకాలం గజగజలాడించిన ఈ వైరస్ తాజాగా మసాచుసెట్స్ రాష్ట్రాన్ని తాకింది. ఈ రాష్ట్రంలో ఒక్క వారంలోనే 2000 మంది మరణించారు. మరోవారం పాటు ఇక్కడ అత్యంత కఠిన పరిస్థితులు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రులను పెంచుతున్నారు.
మరోవైపు ఫ్రాన్స్‌లో కరోనా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 547 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఫ్రాన్స్‌లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 20 వేల మార్కు దాటి 20,265కు చేరింది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న మొదటి ఐదు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటిగా ఉంది.
ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఫ్రాన్స్‌లో భారీగానే ఉంది. దాదాపు లక్షా 55 వేల మంది కరోనా బాధితులు ఫ్రాన్స్‌లో ఉన్నారని ఆ దేశానికి వైద్య ఆరోగ్య విభాగం ప్రకటించింది. కాగా, మొత్తం కేసుల్లో 37,409 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 97,709 యాక్టివ్ కేసులు ఉన్నాయి.