ప్రపంచ ధనవంతుల జాబితాలో మళ్లీ ఎలాన్ మస్క్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఆస్థానంలో ఉన్న ఎల్.వీ.ఎం.హెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్స్ సంపద 2.6 శాతం మేరకు తగ్గిపోవడంతో టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది.
గత డిసెంబరులో ఆర్నాల్ట్స్ తొలిసారి మస్క్‌ను దాటేసి మొదటిస్థానానికి చేరుకున్నారు. టెక్ ఇండస్ట్రీ భారీ ఒడుదొడుకులు ఎదుర్కోవడం, ట్విటర్ కొనుగోలు తర్వాత పరిణామాల నేపథ్యంలో టెస్లా షేరు విలువ అప్పట్లో భారీగా పతనమైంది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద తరిగిపోయింది.
విలాసవంత వస్తువులకు పెట్టింది పేరైన ఎల్‌వీఎంహెచ్ షేర్లు ఏప్రిల్ నుంచి 10 శాతానికి పైగా పడిపోయాయి. ఓ దశలో ఒక్కరోజులోనే ఆర్నాల్ట్స్ సంపదలో 11 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. మస్క్ సంపద మాత్రం ఈ ఏటా పెరుగుతూ పోతోంది. ట్విటర్ కొనుగోలు పరిణామాల నేపథ్యంలో కుంగిన టెస్లా షేర్లు కనిష్ఠాల నుంచి పుంజుకోవడమే ఇందుకు కారణం.