మిస్టర్ ఎర్డోగన్.. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోండి.. భారత్

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (14:44 IST)
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి అభాసుపాలయ్యారు. భారత్ వైపు నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మిస్టర్ ఎర్డోగన్... ఇతర దేశాల సార్వభౌమత్వాలను గౌరవించడం నేర్చుకోండి అంటూ భారత్ చురకలంటించింది. 
 
అంతకుముందు టర్కీ అధినే ఎర్డోగన్ ఐరాస జనరల్ మీట్‌లో ప్రసంగిస్తూ, ద‌క్షిణ ఆసియాలో శాంతికి కాశ్మీర్ స‌మ‌స్య కీల‌క‌మ‌ని, అది ఇంకా ర‌గులుతూనే ఉన్న‌ద‌ని, కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ ర‌ద్దుతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా త‌యారైంద‌ని ఆరోపించారు. అందువల్ల ఈ వివాదాన్ని ఐరాస నిబంధనల ప్రకారం పరిష్కరించాలని చెప్పుకొచ్చారు. 
 
పాకిస్థాన్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్న ట‌ర్కీ అధ్యక్షుడు ఎర్డ‌గోన్‌.. గ‌త ఏడాది కూడా క‌శ్మీర్ అంశాన్ని త‌న సందేశంలో ప్ర‌స్తావించారు. ఇండోపాక్ స‌మ‌స్య‌పై మూడో దేశ ప్ర‌మేయం అవ‌స‌రం లేద‌ని గ‌తంలో ప‌లుమార్లు ఇండియా స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. 
 
కాగా, ఈ వ్యవహారంపై భారత ప్రతినిధి తిరుమూర్తి కాస్తంత ఘాటుగానే స్పందించారు. భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌ గురించి ఎర్డోగన్ మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. 
 
ఈ తీరును భారత్‌ ఏ మాత్రమూ అంగీకరించబోదని చెప్పారు. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ నేర్చుకోవాలని ఆయన తెలిపారు. కాగా, పాక్‌ కూడా కాశ్మీర్ గురించి ప్రస్తావించగా భారత్‌ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు