ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం ప్రారంభమైంది. ఆప్ఘన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి తమ ప్రజలను వెంటనే తీసుకుపోయేందుకు అమెరికా ప్రత్యేక పౌర, యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. అంతేకాదు... రాజధాని కాబూల్‌లో ఎయిర్ ట్రాఫిక్‌ను తన అధీనంలోకి తీసుకుంటోంది. తద్వారా... తమ పౌరులను సురక్షితంగా తీసుకుపోయేలా ప్లాన్ వేసుకుంటోంది.
అమెరికా సంపన్న దేశం కావడంతో... తమ పౌరుల్ని తరలించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 6వేల మంది సైన్యాన్ని రక్షణగా పెట్టుకుంది. అమెరికా వేల మంది తమ పౌరుల్ని తరలించనుంది. వారిలో చాలామంది... అమెరికా ఇదివరకు చేయదలచిన యుద్ధంలో సేవలు అందించేందుకు ఆప్ఘన్ వచ్చినవారే. వారంతా ఇప్పుడు అమెరికా వెళ్లిపోతున్నారు.
చాలా దేశాలు ఇప్పుడు తమ తమ పౌరులను తరలించే పనిలో ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే.. ఆదివారం ఎయిర్ ఇండియా విమానంలో ఆప్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. సోమవారం మరో విమానం అక్కడి నుంచి ఉదయం సమయంలోనే బయలుదేరుతుంది. కొన్ని రోజుల ముందు నుంచే ఇండియా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.