కోవిడ్ నాలుగో వేవ్: పాక్‌లో విజృంభణ.. 1980 కరోనా కేసులు

సోమవారం, 12 జులై 2021 (18:45 IST)
దాయాది దేశం పాకిస్తాన్ కోవిడ్ నాలుగో వేవ్ తో పోరాటం చేస్తోంది. గత కొద్ది రోజులుగా పాక్‌లో కొత్త కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన మూడు వారాల్లో అయితే కోవిడ్ పాజిటివ్​ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 
 
శనివారం పాకిస్థాన్‌లో 1980 కోవిడ్ కేసులు, 27కోవిడ్ మరణాలు నమోదైనట్లు ఆ దేశ జాతీయ హెల్త్ సర్వీసెస్ మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటిచింది. జూన్​ 21న నిర్ధరణ అయిన కేసులతో(663) పోల్చితే శనివారం వచ్చిన కేసులు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
 
తాజాగా పెరిగిన కేసులతో దేశంలో పాజిటివిటి రేటు 4.09 శాతానికి చేరుకుంది. మే 30 నుంచి పాజిటివిటి రేటు నాలుగు శాతాన్ని దాటడం ఇదే తొలిసారని పాక్​ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది చాలా ఆందోళనకర విషయమని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. 
 
వ్యాపార సంస్థలు, పర్యటక ప్రదేశాలను తెరిచేందుకు అనుమతులు ఇవ్వడం వల్ల కేసుల సంఖ్య భారీగా పెరుగతోందని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఈద్ -అల్​ అజా పండుగను కూడా పాక్ ప్రజలు పలు ఆంక్షల నడుమ జరుపుకుంటున్నారు.
 
మరోవైపు, ప్రతిపక్ష పార్టీల హెచ్చరికలు మరియు విద్యార్థుల నిరసనలు ఉన్నప్పటికీ, మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక విద్యార్థుల బోర్డు పరీక్షలను ఇమ్రాన్ ప్రభుత్వం నిర్వహించింది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం వల్ల తాజా రోజువారీ ఇన్ఫెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఇక, పాకిస్తాన్‌లో ఆదివారం నాటికి మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 9,73,824గా ఉండగా,కోవిడ్ మరణాల సంఖ్య 22,582గా ఉంది. 9,13,203మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని..2,100మందికి పైగా క్రిటికల్ కండీషన్ లో ఉన్నట్లు ఆదివారం పాక్ ఆరోగ్య శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు