అదానీ హిండెన్‌బర్గ్ కేసు.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

బుధవారం, 3 జనవరి 2024 (13:16 IST)
అదానీ హిండెన్‌బర్గ్ కేసులో సెబీ చేపట్టిన దర్యాప్తును సిట్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. బదిలీపై వాదనలకు బలం చేకూర్చే ఆధారాలు తమకు కనిపించడం లేదని స్పష్టం చేశారు. 
 
జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఓసీఆర్‌పీ నివేదిక ఆధారంగా అదానీ కేసులో సెబీ చేస్తున్న దర్యాప్తును అనుమానించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. 
 
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ఘన విజయం సాధించింది. బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్‌లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, స్టాక్ ధరలో అవకతవకలు జరుగుతున్నాయని హిండెన్ బర్గ్ అనే విదేశీ కంపెనీ గతేడాది సంచలన నివేదికను వెల్లడించింది. 
 
ఈ వార్త అప్పట్లో భారత స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. అదానీ గ్రూపునకు చెందిన అన్ని స్టాక్స్ పడిపోయాయి. ఈ హిండెన్‌బర్గ్ నివేదిక భారత రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టించింది. అదానీ-హిండెన్‌బర్గ్ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. 
 
అదానీ గ్రూప్‌పై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై దాదాపు 10 నెలల పాటు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదానీ కేసులో సెబీ దర్యాప్తును సిట్‌కు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. 
 
సెబీ 22 అంశాల్లో 20 అంశాలపై దర్యాప్తును పూర్తి చేసింది. మిగిలిన రెండు అంశాల విచారణను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాం. కేసు దర్యాప్తు బదిలీని పరిగణించాలి. కానీ, దర్యాప్తు సక్రమంగా జరగడం లేదనడానికి అవి సాక్ష్యం కాలేవని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
 అయితే, భారతీయ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సెబీకి, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు