రైతులకు అన్నా హజారే మద్దతు

సోమవారం, 28 డిశెంబరు 2020 (20:06 IST)
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా నెల రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా నిరాహార దీక్ష చేపడతానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు.

తన డిమాండ్లను 2021 జనవరిలోగా కేంద్రం ఆమోదించకపోతే తాను చేపట్టే నిరాహార దీక్షయే తన చివరి నిరసన కాగలదని హెచ్చరించారు. మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌లో తాను నివశించే రాలేగావ్‌ సిద్దీ గ్రామంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం మూడు సంవత్సరాలుగా అనేక నిరసనలు చేపట్టానని, కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమని అన్నారు. ప్రభుత్వం చేస్తూ వస్తోన్న ఒట్టి వాగ్దానాలపై తనకు నమ్మకం పోయిందని, ప్రస్తుతం తన డిమాండ్లకు కేంద్రం ఏ చర్య తీసుకుంటుందో వేచి చూస్తున్నానని తెలిపారు.

ప్రభుత్వం అడిగిన ప్రకారం 2021 జనవరి నెలాఖరు వరకు వేచి చూస్తానని, సానుకూలంగా స్పందించకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. డిసెంబర్‌ 8న చేపట్టిన భారత్‌ బంద్‌కు మద్దతుగా అన్నా హజారే నిరాహార దీక్ష రేపట్టిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు