అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా, అరుణాచల్‌లో భారతీయ జనతా పార్టీలు అధికారం దిశగా దూసుకెళుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సిక్కింలో 32 స్థానాలకుగానూ 30 సీట్లలో ఎస్‌కేఎం ముందంజలో ఉంది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతోంది.
ప్రతిపక్ష 'సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్' కేవలం ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యం కనబరుస్తుండడం గమనార్హం. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ ముందంజలో కొనసాగుతున్నారు. మాజీ సీఎం ఎస్‌డీఎఫ్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ వెనకంజలో ఉన్నారు. ఎస్‌డీఎఫ్ తరఫున బరిలో ఉన్న భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా సైతం వెనకబడడం గమనార్హం. భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీ రామ్ థాపా వెనకంజలో కొనసాగుతున్నారు.
అలాగే, అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. 60 సీట్లున్న ఈ రాష్ట్రంలో భాజపా 33 స్థానాల్లో ముందంజలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఆరు, ఎన్సీపీ నాలుగు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఒక స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే విజయం సాధించగా.. మరో అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.