ప్రధాని మోడీ పేరెత్తితే భర్తలకు భోజనం పెట్టొద్దు... మహిళలకు కేజ్రీవాల్ పిలుపు

ఠాగూర్

ఆదివారం, 10 మార్చి 2024 (13:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరెత్తితే తమ భర్తలకు భోజనం పెట్టొద్దని మహిళలకు ఢిళ్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. మహిళలందరూ తమ కుటుంబసభ్యులతో ఆప్‌కు ఓటేయించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, 'అనేక మంది పురుషులు ఈ మధ్య మోడీ పేరు జపిస్తున్నారు. ఈ పరిస్థితిని మీరే (మహిళలు) చక్కదిద్దాలి. మీ భర్తలు మోడీ పేరెత్తితే వారికి రాత్రి భోజనం పెట్టొద్దు. కుటుంబ సభ్యులు ఆప్‌కు ఓటేసేలా మీ మీద వారితో ఒట్టు వేయించుకోండి. బీజేపీకి మద్దతు ఇస్తున్న మహిళలకు మీ సోదరుడు కేజీవాల్ గురించి చెప్పండి. నేను వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటానని వివరించండి' అని మహిళలకు కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు.
 
'నేను ఉచిత విద్యుత్, ఉచిత బస్ టిక్కెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేయండి. ఇప్పుడు నేను 18 ఏళ్లు పైబడ్డ మహిళలందరికీ నెలనెలా రూ.1000 ఇస్తున్నాను. మరి బీజేపీ మహిళలకు ఏం చేసింది? బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం ఏముంది?' అని ఆయన ప్రశ్నించారు. మహిళా సాధికారత పేరిట దేశంలో మోసాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ అన్నారు. 'ఈ పార్టీలు ఏదొక మహిళకు ఓ పోస్టు ఇచ్చి మహిళలందరూ సాధికారత సాధించారని చెప్పుకుంటున్నాయి. మహిళలకు అధికారం వద్దని నేను అనట్లేదు. వాళ్లకు కూడా పెద్ద పోస్టులు కావాలి. టిక్కెట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళకు అన్నీ అందాలి. అయితే, ఇద్దరో నలుగురో మహిళలు ఈ ప్రయోజనాలు పొందితే మిగతా వారి పరిస్థితి ఏంటి అన్నదే తాను ప్రశ్నిస్తున్నాను అని చెప్పారు. తమ కొత్త పథకం ముఖ్యమంత్రి మహిళా యోజన సమ్మాన్‌తోనే మహిళలకు నిజమైన సాధికారత వస్తుందన్నారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమని చెప్పారు. 
 
శ్రీరాముడు బీజేపీలోకి చేరేందుకు నిరాకరిస్తే ఈడీ - సీబీఐని ఉసిగొల్పేది.. కేజ్రీవాల్ సెటైర్లు 
 
శ్రీరాముడు ఈ కాలంలో జీవించివుంటే తమ పార్టీలో చేరాలని భారతీయ జనతా పార్టీ నేతలు ఒత్తిడి చేసేవారని, అందుకు ఆయన నిరాకరించివుంటే ఈడీ, సీబీఐని ఉసిగొల్పేందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. దేశంలో తానేదో పెద్ద ఉగ్రవాదిని అయినట్టుగా ఈడీ అధికారులు పదేపదే సమన్లు పంపిస్తున్నారంటూ మండిపడ్డారు. తనను జైలుకు పంపి తమ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తుందని ఆరోపించారు. 
 
ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ, శ్రీరాముడు కనుక ఈ కాలంలో ఉండివుంటే బీజేపీ ఆయనను కూడా వదిలేది కాదన్నారు. తమ పార్టీలో చేరమని ఒత్తిడి చేసి ఉండేదన్నారు. ఒకవేళ రాముడు కనుక బీజేపీలో చేరేదిలేదని చెబితే ఈడీ, సీబీఐలను ఆయనపైకి ఉసిగొల్పి ఉండేదని వ్యాఖ్యానించారు. 
 
తమ ప్రభుత్వం వికాస్ మోడల్‌ను కొనసాగిస్తుంటే బీజేపీ మాత్రం వినాశ్‌‍ను ఎంచుకుని ప్రతిపక్ష పార్టీలను ఏలుతున్న ప్రభుత్వాలను పడగొడుతుందని ఆరోపించారు. తనకు 8 సమన్లు పంపడంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. తనను అరెస్టు చేసి జైలుకు పంపి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తాను అతిపెద్ద ఉగ్రవాదిని అయినట్టు వారు తనకు నోటీసులు పంపారని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు