ఢిల్లీని వణికిస్తున్న చలి-పులి.. 58 ఏళ్ల చరిత్రలో..?
సోమవారం, 2 నవంబరు 2020 (09:52 IST)
ఢిల్లీని కరోనా ఓ వైపు వణికిస్తుంటే.. మరోవైపు కాలుష్యం కూడా భయపెడుతోంది. వీటికి ప్రస్తుతం చలి కూడా తోడైంది. విజృంభిస్తున్న చలితో దేశ రాజధానివాసులు వణికిపోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సృష్టించాయి.
గత 58 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో దేశ రాజధానిలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఢిల్లీలో గత గురువారం ( అక్టోబరు 26 వ తేదీ) 12.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
గత 26 ఏళ్లలో ఢిల్లీలో అక్టోబరు నెలలో నమోదైన అత్యల్ప సగటు ఉష్ణోగ్రత ఇది. ఢిల్లీలో, 1994 సంవత్సరంలో అక్టోబరు 31 వ తేదీన 12.3 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.
అలాగే, 1962 , అక్టోబరు నెలలో 16.9 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప సగటు ఉష్ణోగ్రత నమోదు కాగా, 58 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఈ ఏడాది అక్టోబరు నెలలో అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.