మైసూర్ - దర్బాంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ఎన్.ఐ.ఏ దర్యాప్తు

ఠాగూర్

శనివారం, 12 అక్టోబరు 2024 (17:29 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా కవరైపేటలో శుక్రవారం రాత్రి మైసూర్ - దర్బాంగా ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైనులో ఆగివున్న గూడ్సు రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోయినప్పటికి వంద మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రమాదం మానవ తప్పిదమా లేక ఉగ్ర కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ప్రమాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ విచారణకు కేంద్రం ఆదేశించింది. 
 
కర్ణాటకలోని మైసూరు నుంచి చెన్నై పెరంబూరు మీదుగా బీహార్‌లోని దర్బంగా వెళ్తున్న భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని కవరైపేట వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ ప్రత్యేకంగా విచారణ జరుపుతోంది. చెన్నై సమీపంలోని పొన్నేరి ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రైలు పట్టాల వైపు నుంచి వైర్లను తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
'అలాగే, సిగ్నల్ బోర్డులపై ఉన్న హుక్స్ తొలగించబడ్డాయి. కానీ, వాటిని రైల్వే సిబ్బంది సకాలంలో కనుగొని సరిచేశారు. ఇది కుట్ర కావచ్చునని అనుమానించబడింది. అందువల్ల ఎన్ఐఏ అధికారులు ప్రమాద స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్, తమిళనాడు పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 500 మంది సిబ్బంది బృందం ఈ సహాయక చర్యల్లో నిమగ్నమైవున్నారు. 
 
రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు దక్షిణ రైల్వే ఐదు భారీ ఎర్త్ మూవర్‌లు, మూడు జేసీబీలు, 140 టన్నుల క్రేన్‌లతో పనులు చేస్తున్నారు. అదనపు డివిజనల్ మెడికల్ ఆఫీసర్ల నేతృత్వంలోని మెడికల్ రిలీఫ్ టీమ్‌లు అత్యవసర సంరక్షణను అందిస్తున్నాయి. మరోవైపు, శనివారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి దర్బంగాకు ప్రత్యేక రైలు 1800 మంది ప్రయాణికులతో బయలుదేరిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు