ఆత్మహత్యకు ముందు 20 రోటీలు ఆరగించిన ఆ కుటుంబం...

మంగళవారం, 3 జులై 2018 (16:22 IST)
ఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన 11 మంది... బలవన్మరణాలకు ముందు రోటీలను ఆరగించారు. ఆ తర్వాత వారు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తేలింది. ఈ రోటీలను కూడా రాత్రి 10.30 గంటల సమయంలో రిషి అనే ఫుడ్ డెలివరీ బాయ్ అందజేశాడు. 
 
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడిన కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. భాటియా కుటుంబం ఈ ఘోరానికి పాల్పడటం వెనుక బలమైన కారణం ఏమిటన్న దానిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇప్పటికీ ఆధారాలు సేకరిస్తున్నారు. మంగళవారం మరోసారి క్లూస్ టీమ్ ఘటనా ప్రాంతాన్ని సందర్శించింది. 
 
ఈ సామూహిక ఆత్మహత్యలపై ఫుడ్ డెలివరీ బాయ్ రిషి మాట్లాడుతూ, 'ఆ రోజు రాత్రి 10:30 గంటల సమయంలో 20 రోటీలు కావాలంటూ వారు ఆర్డర్ చేశారు. 10:45కి డెలివరీ ఇచ్చేందుకు నేను ఆ ఇంటికి వెళ్లాను. భాటియా కుమార్తె రోటీలు తీసుకుని, నాకు డబ్బులివ్వాలంటూ తన తండ్రికి చెప్పింది. ఆ సమయంలో ఇంట్లో అంతా సాధారణంగా కనిపించింది' అని చెప్పుకొచ్చాడు. 
 
కాగా, భాటియా కుటుంబానికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మూఢనమ్మకాలు, తాంత్రిక పూజల కారణంగానే భాటియా కుటుంబం ఈ ఘోరానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు