ఉత్తరాఖండ్‌లో దావనలం... బుగ్గిపాలవుతున్న అడవి

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (13:51 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరుసగా పెను విపత్తులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే జలప్రళయం ఎదుర్కొన్న ఈ రాష్ట్రంలో తాజాగా అడవికి నిప్పు అంటుకుంది. చమోలిలో అడవిలో అగ్ని ప్రమాదం సంభవించి 1,200 హెక్టార్ల అడవి బుగ్గయిపోయింది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. మంటలు నగరానికి చేరువగా వ్యాపించాయి. దీంతో నగర వాసులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. 
 
ఉత్తరా కాశిలోని వరుణవత్ పర్వతంపై మంటలు, గర్హ్వాల్ చౌరేస్ అగ్ని కీలలు శ్రీనగర్ చేరుకున్న తర్వాత హెచ్చరికలు జారీచేశారు. నైనిటాల్‌లో 20 అడవులు కూడా తీవ్ర మంటల్లో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో డిసెంబర్ నుంచి అడవులు అగ్రికి ఆహుతవుతున్నాయి. మంటలను ఆర్పడానికి అటవీ శాఖ ఇప్పుడు హెలికాప్టర్లను పంపాలని రక్షణశాఖను కోరింది.
 
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, నవంబర్ - జనవరి మధ్య ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా అడవి మంటలు సంభవించాయి. నవంబర్ - జనవరి వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో 2,984 అడవి మంటలు సంభవించాయి. వీటిలో 470 ఉత్తరాఖండ్‌లోనే ఉన్నాయి.
 
గత శీతాకాలంలో 39 సంఘటనలు మాత్రమే జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 27 వరకు ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో 787 అగ్ని ప్రమాదాలు జరిగాయని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ మన్ సింగ్ తెలిపారు. మార్చి 27 తర్వాత, అగ్ని ప్రమాదం క్రమంగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 1,299 హెక్టార్ల అటవీ భూములు మంటల్లో చిక్కుకున్నాయి.
 
కాగా, రెండు నెలల్లో వర్షపాతం సాధారణం కంటే 70 శాతం తక్కువగా ఉన్నది. ఫలితంగా భూమి చాలా వరకు ఎండిపోయి ఉన్నది. పొడి గడ్డి, ఆకులు కూడా మంటలకు ఆజ్యం పోస్తాయి. సహజ వనరులలో నీరు క్షీణిస్తుండటం ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు