దేశంలో ఇప్పటికిపుడు ఎన్నికలంటూ జరిగితే భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంటే ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తారని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. అయితే, పోలింగ్‌కు చివరి పది రోజుల్లో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు.
ఆయన ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీహార్‌లో పని చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలకు ఎన్నికల సేవలను వదిలి జేడీయూలో చేరానన్నారు. జేడీయూ చిన్న పార్టీయే అయినా దానికి ఇబ్బందికర చరిత్ర లేకపోవడం తనను ఆకర్షించిందని అన్నారు. తాను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కూడా కలిసి పని చేశానని, నేటి యువతను రాజకీయాల్లోకి ఆకర్షించడం చాలా కష్టమైన విషయమన్నారు.
ఇకపోతే, 'నా లెక్క ప్రకారం 2019 ఎన్నికలకు బీజేపీయే ముందుంది. ఎన్నికల్లో గెలవాలన్నా ఓడాలన్నా చివరి 10-12 రోజులే కీలకమని నా పన్నెండేళ్ల అనుభవం చెబుతోంది. కాబట్టి ఇప్పుడు వేసే అంచనాలన్నీ అపరిపక్వమైనవే. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం బీజేపీదే అధికారం' అని చెప్పారు.
అదేసమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 272 సీట్లు రావడం కష్టం అని అభిప్రాయపడ్డారు. 'విపక్షం బలంగా ఉందా? బలహీనంగా ఉందా? అన్న దానికంటే ఇతర అంశాలే ఎక్కువగా పని చేస్తాయి. దేశంలో 70 శాతం ప్రజల దినసరి ఆదాయం వంద రూపాయలు కూడా లేదు. వారు ఎవరికి ఓటేస్తారో తెలియదు. అందుకే దేశంలో ప్రతీ ఎన్నికలూ నాయకులకు షాక్ ఇస్తుంటాయి' అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపాకు పరిస్థితి కూడా ఏమంత సానుకూలంగా లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పరిస్థితులు మారిపోవచ్చన్నారు. అయితే, వైకాపా, జనసేన కలిసి పోటీ చేస్తే మాత్రం ఫలితం అనుకూలంగా ఉంటుందన్నారు. కానీ, టీడీపీ, వైకాపా, జనసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే మాత్రం ఫలితాలు మరోలా ఉంటాయన్నారు.