బీజేపీకే కర్ణాటక గవర్నర్ ఫస్ట్ ఛాన్స్ ... 17న యడ్యూరప్ప ప్రమాణం స్వీకారం?

బుధవారం, 16 మే 2018 (17:39 IST)
కమలనాథులు ఊహించినట్టుగానే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకార ముహూర్తం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
 
బీజేఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత యడ్యూరప్ప నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వజూభాయ్ వాలాతో మంతనాలు నిర్వహించారు. తన మద్దతుదారుల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ ఆయనకు హామీ ఇచ్చారు. 
 
మరోవైపు, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ముమ్మరంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గవర్నర్ వజుభాయ్ వాలా ఆ అవకాశాన్ని బీజేపీకి ఇవ్వబోతున్నట్లు జాతీయ మీడియా చెప్తోంది. జేడీఎస్, కాంగ్రెస్ నేతలు గవర్నర్ వజుభాయ్ వాలాను బుధవారం సాయంత్రం 5 గంటలకు కలిశారు. జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ నేత కుమార స్వామి గవర్నర్‌కు రెండు లేఖలు సమర్పించారు. అయితే, ఇవన్నీ పక్కనబెట్టిన గవర్నర్ తొలుత బీజేపీకి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో ఈ నెల 12న జరిగిన ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తొలి అవకాశం ఇస్తారని సమాచారం. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు