నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఇకపై ఎలాంటి పరీక్షలు నిర్వహించబోదని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. రిక్రూట్‌మెంట్, ప్రవేశ పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ప్యానెల్ దృష్టి సారించింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) బాధ్యతల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై రిక్రూట్‌మెంట్ పరీక్షలను ఆ సంస్థ నిర్వహించదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన వెల్లడించారు.
'ఉన్నత స్థాయి ప్యానెల్ సిఫార్సు చేసిన సంస్కరణల్లో భాగంగా ఈ మార్పులు చేశాం. ఇకపై రిక్రూట్‌మెంట్ పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహించదు. కేవలం ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుంది. ఇది 2025 నుంచి అమలుకానుంది. ఎన్‌టీఏను ప్రక్షాళన చేస్తాం. వచ్చే ఏడాది దీనిలో మరిన్ని మార్పులు రానున్నాయి. కొత్తగా పది పోస్టులు సృష్టిస్తాం. జీరో - ఎర్రర్ టెస్టింగ్ ఉండేలా ఎన్‌టీఏ పనితీరులో మార్పులు ఉంటాయి' అని తెలిపారు.
'కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించనున్నాం. అంతేకాకుండా.. నీట్ యూజీ పరీక్షలు పెన్-పేపర్ విధానంలో నిర్వహించాలా..? లేదా ఆన్‌లైన్‌లో చేపట్టాలా అనే విషయంపై ఆరోగ్య మంత్రిత్వశాఖతో చర్చలు జరుగుతున్నాయి. అయితే.. భవిష్యత్తులో అన్ని ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది" ఆయన తెలిపారు.
కాగా.. నీట్ ప్రవేశపరీక్ష పత్రం లీక్, ఇతర పరీక్ష నిర్వహణల్లో అవకతవకలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం ఆదేశాలతో విద్యాశాఖ ఉన్నతస్థాయి ప్యానెల్ సంస్కరణలకు ఉపక్రమించింది. ప్రవేశ పరీక్ష, రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహణల్లో సంస్కరణలు చేసింది. ఈ సిఫార్సుల ప్రకారం.. తాజాగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.