కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీకి కరోనా పాజిటివ్

శుక్రవారం, 26 జూన్ 2020 (14:43 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిషేక్ సింఘ్వీకి కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయి చికిత్స చేయించుకుంటున్నారు. 
 
అదేసమయంలో ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన ఇతర కాంగ్రెస్ నేతలు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, అభిషేక్ త్వరగా కోలుకోవాలని పలువురు లాయర్లు, కాంగ్రెస్ నేతలు ఆకాంక్షించారు. 
 
ఇదిలావుండగా, దేశ రాజధానిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే 70 వేల మందికి పైగా వైరస్ సోకగా, 2,300కు పైగా మరణాలు సంభవించాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 
 
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 605 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34 మంది కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన 570 లోకల్ కేసులే. 
 
ఈ నేపథ్యంలో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,489కి చేరింది. తాజాగా, 191 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు 5,196 మంది కోలుకున్నట్టయింది. మరో 6,147 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇక, రాష్ట్రంలో మరణాల రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా 10 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 146కి పెరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు