ఎముక లేని చేయి : ఒక అమ్మాయి కోసం గ్రామం మొత్తానికి సాయం...

సోమవారం, 24 ఆగస్టు 2020 (17:41 IST)
కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలిచిన రియల్ హీరో సోనూ సూద్. ఆయన వెండితెరపై ప్రతినాయకుడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఎందరో జీవితాలను నిలబెట్టిన రియల్ హీరో. ఈయన దానగుణం కరోనా కష్టకాలంలో వెలుగులోకి వచ్చింది. అందుకే సోనూ సూద్‌ను కలియుగ కర్ణుడు అంటూ అనేక మంది అభివర్ణిస్తున్నారు. తాజాగా ఒక అమ్మాయికి సాయం చేసేందుకు ఏకంగా గ్రామం మొత్తానికి సాయం చేశాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 
 
ఇంతకీ ఆ గ్రామానికి సోనూ సూద్ చేసిన సాయం ఏంటో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని సింధూ దుర్గ్‌కు చెందిన స్వాప్నిల్ అనే విద్యార్థిని తన గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్నగుడిసె వేసుకుని అక్కడే చదువుకుంటోంది. ఆన్‌లైన్‌ తరగతులు వినడానికి ఆమె గ్రామానికి ఇంటర్నెట్ సిగ్నల్ రాకపోవడమే అందుకు కారణం. 
 
ఆమె సోదరుడి సాయంతో అక్కడ చదువుకుని సాయంత్రానికి ఇంటికి వస్తోంది. పైగా, ఆమె వైద్య ప్రవేశ పరీక్షలకు కూడా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సోను సూద్ ఆమెతో పాటు ఆమె ఉంటోన్న ఊరి మొత్తానికి సాయం చేస్తున్నాడు.
 
ఆ గ్రామానికి ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. సోనూ సూద్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోను చేతికి ఎముకేలేదన్న విషయం మరోమారు నిరూపితమైందని అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఆ  విద్యార్థిని ఓ చిన్న గుడిసెలో చదువుకుంటోన్న ఫొటోను ఒకరు పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు